అడగకుండా ఇవ్వడంతో అలుసైపోయాం... కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఈ విషయంలో లిక్కర్ పాలసీ, ఇసుక పాలసీ, వాలంటీర్ వ్యవస్థ, చంద్రబాబు అరెస్ట్ మొదలైన కారణాలను ఇప్పటి వరకూ పలువురు నేతలు తెలిపారు!

Update: 2024-07-03 04:11 GMT

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘోర పరాజయానికి సంబంధించిన పోస్ట్ మార్టం కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అయితే... మొదట్లో తమ ఓటమికి ఈవీఎం లు కారణం అన్నట్లుగా అధినేత వ్యాఖ్యానించినా... రోజులు గడిచే కొద్దీ వాస్తవంలోకి వస్తున్నారు వైసీపీ నేతలు.

అవును... ఇటీవల గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడానికి ఈవీఎం లు కారణం అని అనిపిస్తుందని, కాకపోతే ఆధారాలు లేకుండా మాట్లాడలేమని, ఈవీఎం ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని జగన్ చెప్పుకొచ్చారు. అయితే... ఆ తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే వాస్తవాలు గ్రహించినట్లు మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా... కొన్ని కీలక విషయాలు తెరపైకి తెస్తున్నారు.

ఈ విషయంలో లిక్కర్ పాలసీ, ఇసుక పాలసీ, వాలంటీర్ వ్యవస్థ, చంద్రబాబు అరెస్ట్ మొదలైన కారణాలను ఇప్పటి వరకూ పలువురు నేతలు తెలిపారు! ఈ సమయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాత్రం మరో కీలక కారణం చెప్పారు. ఇందులో భాగంగా... అడగనిదే ఇస్తే విలువ ఉండదని.. అదే వైసీపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద పొరపాటని.. డిమాండ్ & సప్లై రూపంలోనే ఉండాలేమో అని తెలిపారు.

దీనికి ఉదాహరణగా... సాధారణంగా నియోజకవర్గంలో ఏదైనా పని చేయించాలంటే 10 రోజులు ఎమ్మెల్యే దగ్గరకు తిరగాలి.. అనంతరం మరో 20 రోజుల తర్వాత సదరు ఎమ్మెల్యే ఆ కార్యక్రమాన్ని ఆడంబరంగా పూర్తి చేస్తుంటారు! అలా చేస్తేనే ఎమ్మెల్యే చేశాడు అని అనుకుంటారేమో అని అన్నారు. అయితే తాను మాత్రం "గుడ్ మార్నింగ్ ధర్మవరం" కార్యక్రమంలో జనం దగ్గరకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని స్పాట్ లో పరిష్కారం చూపడానికి ప్రయత్నించినట్లు చెప్పారు.

"ఆ విధంగా ఎవరైనా అడిగితే.. అప్పుడు ఇవ్వాలి తమను అడగకుండా ఏది ఇచ్చిన విలువ ఉండదు.. ప్రతీ చోటా అదే జరిగింది. నా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో కూడా రోజూ వెళ్లి, చెప్పి, అడిగి, చేయడం వల్ల చులకన అయిపోయామేమో అనే ఒక భావన కూడా ఉంది" కేతిరెడ్డి మెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. 100% కరెక్ట్ అంటూ నెటిజన్లు స్పందిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News