కొత్త అడుగు: ఏపీలో డ్రైవింగ్ లైసెన్సు కార్డుకు చెల్లుచీటి

మారుతున్న పద్దతులకు అనుగుణంగా.. తనను తాను అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది.

Update: 2023-08-19 04:30 GMT

మారుతున్న పద్దతులకు అనుగుణంగా.. తనను తాను అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయంలో ఏపీలోని వైసీపీ సర్కారు ముందుంది. దశాబ్దాల తరబడి ఉన్న విధానాలకు అందివచ్చిన టెక్నాలజీ సాయంతో చెక్ చెప్పేస్తూ.. మరింత సులువైన మార్గాల దిశగా అడుగులు వేస్తోంది. వాహనాల్ని నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్సుకు కార్డుల్నిజారీ చేయటం.. అదే సమయంలో వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆర్సీ కార్డుల్ని ఇవ్వటం తెలిసిందే.

ఇకపై అలాంటిదేమీ లేకుండా ఈ లైసెన్సు.. ఈ- ఆర్సీ బుక్ ను పంపేలా మార్పులు చేశారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు. ఇప్పటివరకు ఉన్న కార్డు సిస్టంకు చెక్ పెట్టి.. కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.ఇకపై యాప్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న ఈ లైసెన్సును తమతో ఉంచుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన హార్డ్ కాపీ లేదంటే.. సాఫ్ట్ కాపీని మొబైల్ ఫోన్ లో చూపించటం ద్వారా లైసెన్సుదారులకు మరింత సులువుగా లైసెన్సుల్ని జారీ చేయనున్నారు.

అంతేకాదు.. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్సులకు.. ఆర్సీ బుక్ లకు పంపేందుకు రూ.200, పోస్టల్ ఛార్జీల కింద రూ.25 వసూలు చేసేవారు. ఇకపై అలాంటి చార్జీల భారం ఉండదు. ఇకనుంచి డిజిటల్ లైసెన్సు.. ఆర్సీకార్డుల్ని జారీ చేయటం ద్వారా వాహనదారులకు ధ్రువ పత్రాల్ని తమ వెంట తీసుకెళ్లాల్సిన కష్టం తప్పనుంది. మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకున్న ఈ-పత్రాల్ని చూపిస్తే సరిపోతుంది. ఈ మధ్యన పలురాష్ట్రాలు కొత్త విధానాన్ని ఫాలో అవుతున్న వేళ.. ఏపీలో ఆ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేశారు. ఇకపై పోలీసులు.. రవాణా శాఖాధికారులు తనిఖీలుచేసినప్పుడు.. పాత విధానంలో మాదిరి కార్డుల్ని చూపించాల్సిన అవసరం లేకుండా.. ఈ-లైసెన్సుల్ని మొబైల్ లో చూపిస్తే సరిపోతుంది.

Tags:    

Similar News