స్కిల్ స్కాం కేసులో కీలక పరిణామం... టీడీపీకి సీఐడీ నోటీసులు!

అందులో భాగంగా... టీడీపీ కేంద్ర కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది

Update: 2023-11-14 15:37 GMT

గతకొన్ని రోజులుగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించిన అంశం కాస్త స్లో అయ్యిందనే కామెంట్లు వినిపించేవి! ఈ స్కాం కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఈ నెల 28 వరకూ ఈ అంశం కోల్డ్ స్టోరేజే అని చాలామంది భావించారు! ఈ సమయంలో కీలక పరిణామం జరిగింది. అందులో భాగంగా... టీడీపీ కేంద్ర కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

అవును... ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో రూ.27 కోట్ల మేర డబ్బులు లావాదేవీల విషయం లో తెలుగుదేశం పార్టీకి  సంబందించిన అకౌంట్స్ కోసం సీఐడీ విచారణ మొదలు పెట్టింది . దీనికి సంబంధించిన వివరాలను కూడా కోర్టుల్లో సమర్పించింది. ఇప్పుడు ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలు కోరుతూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీంతో మరోసారి స్కిల్ స్కాం కేసు హాట్ టాపిక్ గా మారింది!

ఈ మేరకు టీడీపీ ఖాతాల వివ‌రాల‌ను ఇవ్వాల‌ని పార్టీ కార్యాల‌య కార్యద‌ర్శి అశోక్‌ బాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. పార్టీ అకౌంట్స్ వివరాలు వెల్లడించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది సీఐడీ! ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ నోటీసుల్లో సీఐడీ సూచించింది!

కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో భాగంగా సుమారు రూ.27 కోట్ల అవకతవకలు జరిగినట్టు కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌ లో సీఐడీ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నిధులే అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబుకు చేరిన‌ట్టు సీఐడీ చెబుతోంది! ఈ నేప‌థ్యంలో గ‌డువు లోపు ఆ వివ‌రాలు సీఐడీకి స‌మ‌ర్పిస్తుందా? లేక న్యాయ‌స్థానాన్ని ఆశ్రయిస్తుందా? అనేది వేచి చూడాలి!

మరోపక్క గతంలో అమ‌రావ‌తి రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్ కేసు సమయంలో విచార‌ణ ఎదుర్కొన్న లోకేష్ కు అప్పట్లో సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. హెరిటేజ్ అకౌంట్స్ వివ‌రాల‌ను ఇవ్వాల‌ని సీఐడీ ఆదేశించింది. ఆ సమయంలో లోకేష్ న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించి ఉప‌శ‌మ‌నం పొందారు. ఈ సమయంలో టీడీపీ పార్టీ ఆఫీసుకి తాజాగా నోటీసులు జారీచేసింది సీఐడి!

కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంటి ఆపరేషన్, మొదలైన ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

దీంతో ఇటీవల కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్న చంద్రబాబు ప్రస్తుతం హైద‌రాబాద్‌ లోని ఆయ‌న నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీ నాటికి ఆయ‌న మ‌ధ్యంత‌ర బెయిల్ గ‌డువు ముగుస్తుంది. దీంతో ఆరోజు సాయంత్రం 5 గంటలలోపు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి లొంగిపోవాల్సి ఉంటుంది!

Tags:    

Similar News