హిందువులే టార్గెట్: కెనడాలో భక్తులపై ఖలిస్థాన్ దాడులు!
కీలకమైన కెనడా ప్రధాని ఎన్నికలకు ముందు.. ఖలిస్థానీలు రెచ్చిపోతున్నారు.
ఏ విత్తనం నాటితే ఆ చెట్టే పెరుగుతుంది. ఖలిస్థానీలను నమ్మవద్దు.. మద్దతు ఇవ్వొద్దు.. అని భారత్ నెత్తీ నోరూ మొత్తుకున్న కెనడా వినలేదు. పైగా వారికి మద్దతుగా ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారత దేశంపై కాలు రువ్వారు. ధిక్కారమున్ సైతువా! అంటూ.. రెండు వారాల కిందట వరకు..దౌత్య యుద్ధానికి తెరదీశా రు. అయితే.. ట్రూడో ఎవరినైతే.. సమర్థిస్తున్నారో.. ఎవరి పక్షాన వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారో.. వారే.. ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర వాద దాడులకు తెగబడుతున్నారు.
కీలకమైన కెనడా ప్రధాని ఎన్నికలకు ముందు.. ఖలిస్థానీలు రెచ్చిపోతున్నారు. దేశంలో 6.5 శాతంగా ఉన్న హిందువులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇది ట్రూడో విజయంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఇప్పుడు ఆయన వార్నింగులు ఇస్తున్నారు. విచారం వ్యక్తం చేస్తున్నారు. కానీ, చేసిన పాపం.. చేస్తున్న పాపం కూడా కెనడాను ఖలిస్థానీల రూపంలో వెంటాడుతోంది.
తాజాగా ఏం జరిగింది?
కెనడాలోని బ్రాంప్టన్ ప్రావిన్స్‌లో ఖలిస్తానీలు రెచ్చిపోయారు. హిందూ భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ప్రావిన్స్‌లో ఉన్న ఏకైక హిందూ ఆలయానికి కార్తీక మాసం(భారత క్యాలెండర్ ప్రకారం) ప్రారంభాన్ని పురస్కరించుకుని పూజలు చేసేందుకు భక్తులు తరలి వచ్చారు. దీనిని పసిగట్టిన ఖలిస్థానీలు.. హిందువులపై దాడులతో రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికి నట్టు చితకొట్టారు. ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఖండనలు..
ఇక, ఈ దాడులను ఖండిస్తున్నామని .. ఖలిస్థానీలకు అప్రకటిత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్న పేరు తెచ్చుకున్న ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించారు. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కూడా చెప్పుకొ చ్చారు. అన్ని మతాల ప్రజలను, వారి హక్కులను, విశ్వాసాలను కూడా కాపాడతామన్నారు. ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కానివని వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఇంత జరిగినా.. `పైనుంచి` ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు మౌనంగా వీక్షించారన్న విమర్శలు వస్తున్నాయి. ``మేం ఎవరినీ అరెస్టు చేయలేదు`` అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిని బట్టి ఖలిస్థానీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
విపక్షం నిరసన
కెనడాలోని ప్రధాన ప్రతిపక్షం కన్జర్వేటీవ్ పార్టీ హిందువులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించింది. సర్కారు ఉదాసీనత కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేత పియర్రె పొయిలీవ్రే నిరసన వ్యక్తం చేశారు. ట్రూడో ప్రభుత్వం ఇలాంటి వాటిని అరికట్టలేక పోతోందన్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని.. అప్పుడు ప్రశాంత వాతావరణం కల్పిస్తామని వ్యాఖ్యానించారు.
మీకు మీరే కాపాడుకోండి!
కెనడా అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య ఈ దాడులపై మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మీకు మీరే కాపాడుకోండి.. అంటూ హిందువులకు ఆయన ఉచిత సలహా ఇచ్చారు. హిందువులేతమ హక్కులు కాపాడుకోవాలన్నారు. అయితే.. కెనడాలో తీవ్రవాద శక్తులు రాజకీయాల్లోకి, చట్ట వ్యవస్థల్లోకి కూడా చొరబడ్డాయన్నారు.
భారత్ దిగ్భ్రాంతి
కెనడాలో కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీ తీవ్ర వాదులు దాడులు చేయడం పట్ల భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను తాము ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.