పోతే ఒక్క ప్రాణం.. వస్తే 9 ప్రాణాలు..మున్నేరులో హర్యానా వ్యక్తి సాహసం

ఉంటే ఒక్కటి.. సత్తె రెండు.. ఇదీ కొందరి పద్ధతి. ఉన్నన్నాళ్లూ నలుగురికి సాయం చేయాలనేది వీరి ఉద్దేశంగా ఉంటుంది.

Update: 2024-09-03 11:44 GMT

ఉంటే ఒక్కటి.. సత్తె రెండు.. ఇదీ కొందరి పద్ధతి. ఉన్నన్నాళ్లూ నలుగురికి సాయం చేయాలనేది వీరి ఉద్దేశంగా ఉంటుంది. అయితే, అన్నిసార్లూ అది కుదరదేమో? కానీ, కొన్నిసార్లు మాత్రం తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో పోతే ఒక్క ప్రాణం.. వస్తే 9 ప్రాణాలు అన్నట్లు గా సాహసం చేశాడు ఓ వ్యక్తి. అతడిది ఆ జిల్లా కాదు.. ఆ రాష్ట్రం కూడా కాదు. కానీ, ఆ 9 మందికి ప్రాణ దాత అయ్యాడు. అతడే గనుక సాహసానికి దిగకుంటే.. వారంతా గల్లంతయ్యేవారే. ఇదంతా ఖమ్మం మున్నేరు వాగు వరదలో చిక్కుకున్నవారిని కాపాడిన ఓ వ్యక్తి గురించి.

శభాష్ సుభాన్

రెండు రోజుల కిందట ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రాకాశ్ నగర్ వంతెనపై 9 మంది చిక్కుకుపోయారు. వీరంతా హాహాకారాలతో సహాయం కోసం అభ్యర్థిస్తూ వీడియోలు పంపారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెలికాప్టర్లను రప్పించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ, ప్రతికూల వాతావరణంతో ఇబ్బంది తలెత్తింది. లేదా సమయం సరిపోని పరిస్థితి. మరోవైపు అంతకంతకూ బ్రిడ్జిపై ఉన్నవారిలో ఆందోళన పెరుగుతోంది. అటు వాగును చూస్తే ఏమీ చేయలేమా? ప్రాణాలు దక్కుతాయా? అనే భయం. అలాంటి సమయంలో వచ్చాడు సుభాన్ ఖాన్.

బుల్డోజర్ తీశాడు..

తెలంగాణలో ఇటీవల బాగా పాపులర్ అయిన పదం బుల్డోజర్. అయితే, ఇక్కడ బుల్డోజర్ ను తీసింది సుభాన్. మున్నేరు వరదకు భయపడకుండా.. ప్రాకాశ్ నగర్ బ్రిడ్జిపై ఉన్నవారిని కాపాడేందుకు బయల్దేరాడు. చుట్టూ ఉన్నవారు వద్దని హెచ్చరించారు. కానీ.. సుభాన్ చెప్పింది ఒక్కటే.. ‘‘నేను చనిపోతే, అది ఒక జీవితం, కానీ నేను తిరిగి వస్తే, నేను తొమ్మిది జీవితాలు’’ అని. దీనికి తగ్గట్లే అతడు బుల్డోజర్ ను ధైర్యంగా ముందుకు పోనిచ్చాడు. వంతెనపై ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్న తొమ్మిది మందితో తిరిగి వచ్చాడు. అంతే.. సుభాన్ వారికి దేవుడయ్యాడు. సుభాన్‌ మిగతావారికి హీరోగా మారాడు. కాగా, సుభాన్ సాహసాన్ని అందరూ మెచ్చకుంటుంటే.. అతడి కుమార్తె మాత్రం కాస్త భయాందోళనతో కనిపించింది. నా కాళ్లు వణికాయి. అయినా మా నాన్న వాళ్లను రక్షించాడు. అని ఆమె చెప్పింది. అతను అనుకున్నది చేయగలిగాడు అని తెలిపింది. కాగా, సుభాన్.. వంతెనపై నుంచి 9 మందిని తీసుకొస్తుండగా అక్కడ ఉన్నవారు జయజయధ్వానాలు చేశారు.

సుభాన్ ఫోన్ కు కాల్స్ వరద

భారీ వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడిన సుభాన్ ఫోన్ కు కాల్స్ వరద మొదలైంది. ప్రభుత్వం అతడి సాహసాన్ని గుర్తించింది. కాగా, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News