"శ్రీమహావిష్ణువు 11వ అవతారమే మోడీ!"
మతాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని, రామమందిర ఉత్సవానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారని.. ఇదేసమయంలో ప్రజలు అల్లాడుతున్న అనేక సమస్యలను పట్టించుకోవడం దారుణమని విమర్శించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. "శ్రీమహావిష్ణువు 11వ అవతారమే మోడీ అని తనను తాను అనుకుంటున్నారు. ఇతర దేవీ దేవతల కన్నా.. తనే ఎక్కువని భావిస్తున్నారు" అని దుయ్యబట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిశిత విమర్శలు చేశారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని, రామమందిర ఉత్సవానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారని.. ఇదేసమయంలో ప్రజలు అల్లాడుతున్న అనేక సమస్యలను పట్టించుకోవడం దారుణమని విమర్శించారు.
"దేశ ప్రజలు ఉదయం లేవగానే దేవీదేవతలు, గురువుల ముఖాలు చూస్తారు. అంతా మంచి జరగాలని కోరుకుంటారు.కానీ, మోడీ మాత్రం.. ఆ దేవీ దేవతల విగ్రహాలు, గురువుల చిత్రపటాలకు బదులుగా తన మొహం చూడాలని కోరుతున్నారు. ఆయన శ్రీమహావిష్ణువు 11వ తారంగా తనను తాను ఊహించుకుంటున్నారు" అని ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఇంకోసారి గెలిస్తే.. ఆయనకే గుడి కట్టించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. మత పరమైన సెంటిమెంట్లను రాజకీయాల్లోకి చొప్పించడం మోడీకే సాధ్యమైందని దుయ్యబట్టారు.
"బీజేపీ తరఫున చాలా మంది ఈ దేశానికి సేవ చేశారు. వాజపేయి వంటివారు కూడా ప్రధానిగా చేశారు. కానీ, మోడీ వారికన్నా అతీతంగా ఉండాలని భావిస్తున్నారు. తనను తాను దైవాంశ సంభూతిడిగా కాదు.. ఏకంగా దేవుడిగా భావిస్తున్నారు. మతాన్ని సెంటిమెంట్లకు జోడించి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు." అని ఖర్గే వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తరిమి కొట్టకపోతే.. దేశంలో మత చిచ్చు ఖాయమని ఖర్గే హెచ్చరించారు. తాను చెడడమే కాకుండా..దేశాన్ని, దేశ లౌకిక వాదాన్ని కూడా చెడగొట్టేందుకు మోడీ కంకణం కట్టుకున్నారని ఖర్గే నిప్పులు చెరిగారు. డెహ్రాడూన్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడారు.