ఈ నియంతతో అమెరికా, దాని మిత్ర దేశాలకు డేంజర్‌ బెల్స్‌!

ఉత్తర కొరియా తరచూ చేసే అణ్వాయుధ పరీక్షలు, క్షిపణి పరీక్షల శిధిలాలు అమెరికా మిత్ర దేశాలయిన దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో పడుతుండటం గమనార్హం.

Update: 2024-09-11 14:30 GMT

అమెరికా, దాని మిత్ర దేశాల దృష్టిలో నియంతగా ముద్రపడ్డాడు.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌. అలాగే ధూర్త దేశంగా పాశ్చాత్య దేశాలు ఉత్తర కొరియాను అభివర్ణిస్తుంటాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ను అధ్యక్షుడిగా కంటే నియంతగా చూసేవారే ఎక్కువ. ఆ దేశంలో ఉన్న నిబంధనలు, ఆంక్షలు అలాంటివి మరి.

కాగా ఎప్పటికప్పుడు తరచూ అణ్వాయుధ పరీక్షలు, ఖండాంతర క్షిపణి పరీక్షలతో అమెరికా, దాని మిత్ర దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌. అమెరికా శత్రు దేశాలైన రష్యా, చైనాలతో అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ అమెరికా, దాని మిత్ర దేశాలకు కిమ్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు.

ఉత్తర కొరియా తరచూ చేసే అణ్వాయుధ పరీక్షలు, క్షిపణి పరీక్షల శిధిలాలు అమెరికా మిత్ర దేశాలయిన దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో పడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చర్యలపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని అమెరికాను కోరుతూ వస్తున్నాయి.

మరోవైపు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా, దాని మిత్ర దేశాలతో పోరాడటానికి తమ అణ్వాయుధ దళాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలను రెట్టింపు చేస్తామని తాజాగా కిమ్‌ బాంబుపేల్చారు. ఈ మేరకు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఈ విషయం తెలిపింది.

ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని రెచ్చగొట్టేలా కిమ్‌ వ్యవహరిస్తారని చెబుతున్నారు.

తాజాగా సెప్టెంబర్‌ 9న తన ప్రభుత్వ 76వ వ్యవస్థాపక వార్షికోత్సవ సందర్భంగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రసంగించారు. అమెరికా దాని మిత్రదేశాల వల్ల ఉత్తర కొరియా ముప్పు ఎదుర్కొంటోందన్నారు. ఈ నేపథ్యంలో తాము అణ్వాయుధ దళాన్ని, సైనిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఆయన ప్రమాణం చేసి చెప్పడం విశేషం.

ఇప్పటికే అణ్వాయుధాలను ఉత్తర కొరియా సమకూర్చుకుంది. అలాగే అమెరికాను చేరగల ఖండాంతర క్షిపణులను సైతం సిద్ధం చేసుకుంది. పలు దేశాలకు ఉత్తర కొరియా ఆయుధాలను కూడా ఎగుమతి చేస్తుండటం గమనార్హం. కిమ్‌ తాజా హెచ్చరికల నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు ఎలా స్పందిస్తాయనేది హాట్‌ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News