అక్కడ అబ్బాయిలో అసంతృప్తి...చల్లార్చేదెలా ?
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం కీలకమైనది. ఈ సీటు పొలిటికల్ గా వెరీ హాట్ అని చెప్పాలి.
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం కీలకమైనది. ఈ సీటు పొలిటికల్ గా వెరీ హాట్ అని చెప్పాలి. ఇప్పటికి అయిదు సార్లు ఇదే సీటు నుంచి పోటీ చేసి మూడు సార్లు గెలిచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ సొంత ఇలాకాగా చెప్పుకుంటారు.
ఇక ఆయనని 2024 ఎన్నికల్లో ఓడించిన వారు కూడా సామాన్య నేత కాదు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూసి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు. ఆయన ఎచ్చెర్ల టికెట్ కోరుకుంటే చివరి నిముషంలో విజయనగరం జిల్లాలోని చీపురుపల్లికి రప్పించి పోటీ చేయించారు.
అప్పటిదాకా ఈ సీటు మీద ఆశలు పెట్టుకుని అయిదేళ్ళ పాటు పనిచేసిన కిమిడి నాగార్జున ఈ పరిణామంతో నిరాశ చెందారు. నాగార్జున కళా వెంకట్రావు తమ్ముడు కుమారుడే. పైగా నాగార్జున తల్లి కిమిడి మృణాళిని 2014 నుంచి 2017 దాకా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
ఆ కుటుంబం తరఫున వారసుడిగా నాగార్జున ఎదుగుతూ వస్తున్నారు. ఆయన 2019లో మొదటిసారి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. అయితే ఆనాడు వైసీపీ ప్రభంజనం గట్టిగా వీచడంతో అందరితో పాటే ఆయన కూడా ఓటమి చెందారు. కానీ నిరాశ పడకుండా అయిదేళ్ల పాటు చీపురుపల్లిని అట్టే బెట్టుకుని పార్టీ పటిష్టతకు విశేషంగా కృషి చేశారు ఈసారి టికెట్ దక్కితే నాగార్జున కచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండేవారు అని ఆయన అనుచరులు చెబుతారు. అయితే పెదనాన్న కోసం పార్టీ అధినాయకత్వానికి ఇచ్చిన మాట కోసం ఆయన తన సీటుని త్యాగం చేశారు.
అయితే ఇపుడు చూస్త అబ్బాయిలో అసంతృప్తి పెరుగుతోందని అంటున్నారు. దానికి కారణం ఆయనకు గత రెండు విడతలుగా జరిపిన నామినేషన్ పోస్టుల పందేరంలో పదవి దక్కలేదని అంటున్నారు. విజయనగరం జిల్లాలో చాలా మందిని అవకాశాలు దక్కాయి. వారంతా త్యాగాలు చేశారని గుర్తించి మరీ అధినాయకత్వం కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది.
మరి విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు, చీపురుపల్లిలో పార్టీని అభివృద్ధి చేశారు. పార్టీ పట్ల విధేయత చూపుతూ వచ్చారు. యువకుడుగా డైనమిక్ లీడర్ గా ఉన్న నాగార్జున సేవలను గుర్తించి కీలక పదవి ఇస్తే బాగుండేదని ఆయన అనుచరుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. అయితే మరో ఇరవై దాకా పోస్టులు ఉన్నాయి కాబట్టి నాగార్జునకు అన్యాయం జరగదని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
అలా అవకాశం ఇస్తే ఫరవాలేదు కానీ కాకుంటే మాత్రం అబ్బాయి మరింత అసంతృప్తి చెందుతారని అంటున్నారు. ఎంతో ఫ్యూచర్ ఉన్న నేతగా దూకుడు కలిగిన రాజకీయ నాయకుడుగా ఉన్న నాగార్జునను పార్టీ కూడా వదులుకోదనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.