అఖిలకు షాక్ ఇచ్చిన అన్న!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం.. ఆళ్లగడ్డ. ఇక్కడ భూమా కుటుంబానికి ఎంతో చరిత్ర ఉంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం.. ఆళ్లగడ్డ. ఇక్కడ భూమా కుటుంబానికి ఎంతో చరిత్ర ఉంది. గతంలో భూమా శేఖరరెడ్డి, ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి, నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి, వీరి కుమార్తె అఖిలప్రియ ఇలా ఎంతోమంది ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అఖిలప్రియ మంత్రిగా చేయగా, ఆమె తల్లి శోభా నాగిరెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున అఖిలప్రియ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆమెకు సొంత ఇంటి నుంచే పోరు తప్పడం లేదు. అఖిలప్రియ పెద నాన్న కుమారుడు, ఆళ్లగడ్డ బీజేపీ ఇంచార్జి భూమా కిశోర్ రెడ్డి, అఖిలప్రియ మేనత్త శ్రీదేవి.. ప్రస్తుతం ఆమెకు వ్యతిరేకంగా మారారు.
తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భూమా కిశోర్ రెడ్డి, శ్రీదేవి.. అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మాట్లాడుతూ.. అఖిలకు భూమా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ భూమా కుటుంబం అంతా వచ్చే ఎన్నికల్లో కిషోర్ రెడ్డికే మద్దతు ఇస్తుందని వెల్లడించారు. అఖిలప్రియకు మద్దతు ఇచ్చేదే లేదని కుండబద్దలు కొట్టారు. అఖిల ప్రియ.. భూమా కుటుంబానికి చెందింది కాదని హాట్ కామెంట్స్ చేశారు. తన భర్త మద్దూరు భార్గవరామ్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని బాంబుపేల్చారు.
వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా కుటుంబం తరఫున ఎమ్మెల్యేగా బరిలో ఉండేది తానేనని భూమా కిశోర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 7 లేదా 9వ తేదీ నుంచి ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.
ఆళ్లగడ్డతో మద్దూరు అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవరాంకు ఎలాంటి సంబంధం లేదని కిశోర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమా కుటుంబం అంటే తామేనని తేల్చిచెప్పారు. భూమా కుటుంబం అంటే మద్దూరు అఖిల ప్రియ ఎంతమాత్రం కాదన్నారు.
మద్దూరు అఖిలప్రియ చేసిన ఘోరాలు అందరికీ తెలుసని భూమా కిశోర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమెను తమ ఫ్యామిలీ పక్కన పెట్టిందన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ అధిష్ఠానం తనకు సీటు ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అంతేకానీ, అఖిల ప్రియకు మద్దతు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. భూమా కుటుంబంలో విభేదాలు కాక రేపుతున్నాయి.