కొడాలి నాని - పవన్ కరచాలనం... వీడియో & కామెంట్స్ వైరల్!
ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్... రాధా బెస్ట్ ఫ్రెండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీలు హాజరయ్యారు! ఈ సమయంలోదే ఆ వీడియో!
ఏపీలో రాజకీయాలు పూర్తి రసవత్తరంగా మారిపోతున్నాయి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టవ్వడం.. 45 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండటం.. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ అధికారిక ప్రకటన చేయడం.. ఈ కూటమిపై వైసీపీ నేతలు ఎవరికి స్టైల్లో వారు విమర్శలు గుప్పించడంతో ఏపీ రాజకీయాలు యమ రంజుగా మారిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక వీడియో వైరల్ అవుతుంది.
అవును... ఏపీలో పవన్ కల్యాణ్ పేరు చెబితే విరుచుకుపడే నేతల్లో కొడాలి నాని ఒకరు! తాజాగా "నిజం గెలవాలి" యాత్రపై స్పందిస్తూ... పవన్ కల్యాణ్ జనసేన ను "జన సున్నా" అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పవన్ టీడీపీతో కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా... అది పూర్తిగా చంద్రబాబు ఆదేశాల మేరకే చేశారని, చేస్తారని ఆయన విమర్శించారు. ఈ సమయంలో పవన్ తో కరచాలనం కోసం కొడాలి నాని తాపత్రయ పడుతున్నారంటూ పవన్ ఫ్యాన్స్ ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల వంగవీటి రాధా వివాహం కృష్ణాజిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్ లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా రాధా స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్... రాధా బెస్ట్ ఫ్రెండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీలు హాజరయ్యారు! ఈ సమయంలోదే ఆ వీడియో!
ఈ సమయంలో వేదికవద్ద వంగవీటి రాధ పక్కన పవన్ కల్యాణ్ అప్పటికే ఉన్నారు. ఈ సమయంలో బౌన్సర్స్ వారి చుట్టూ ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎంటరయ్యారు. ఈ సమయంలో... నానీ తన సెక్యూరిటీని దాటుకుంటూ, ఇతరులు ఎవరూ ఎంటరవ్వకుండా అప్పటికే చుట్టుముట్టిన బౌన్సర్లు ఆయనను మాత్రమే పంపించేలా దారి ఇస్తున్న సమయంలో.. ఈ దృశ్యం కనిపిస్తుంది!
దీంతో... అదిగో పవన్ ని కలవడానికి కొడాలి నాని తెగ కష్టపడుతున్నారని.. అయినా బౌన్సర్లు ఆపేస్తున్నారని.. పవన్ కల్యాణ్ అభిమానులు వీడియోని షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే వాస్తవంగా ఆ సెక్యూరిటీని దాటుకుంటూ రాధకు సమీపంలోకి కొడాలి వెళ్లగా... చిరునవ్వులు చిందిస్తూ పవన్ కల్యాణ్ ముందుగా కొడాలికి చెయ్యి అందించారు.. దీంతో కొడాలి కూడా ప్రతిస్పందించారు! ఇది వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది!
సరిగ్గా ఇదే విషయాన్ని తెలియజేస్తూ కొడాలి నాని అభిమానులు, వైసీపీ కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు. కాస్త సరిగా గమనిస్తే... ఎవరు ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చారనేది స్పష్టం అవుతుందని కామెంట్లు పెడుతున్నారు. ఇదే సమయంలో కొడాలి నానీ మాజీ మంత్రి అని గుర్తుచేస్తున్నారు.. నాలుగు సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యే అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ విధంగా ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న కామెంట్ల్ వార్ మధ్యలో... “ఇలాంటి అత్యంత సాధారణమైన విషయాలకే పొంగిపోయేవారిని అల్ప సంతోషులు అంటారు” అని పలువురు న్యూట్రల్ నెటిజన్లు కామెంట్లు పెడుతుండటం గమనార్హం.