జూనియర్ ఎన్టీఆర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!
జూనియర్ ఎన్టీఆర్ అనుచరులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అనుచరులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారిద్దరూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. వీరిద్దరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ తో సాంబ, అదుర్స్ వంటి సినిమాలను కూడా నిర్మించారు.
ముఖ్యంగా కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్ కు అనుబంధం ఎక్కువ. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణకు ముఖ్య అనుచరుడిగా కొడాలి నాని ఉండేవారు. ఈ సన్నిహితత్వంతోనే గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును కూడా కాదని కొడాలి నానికి 2004లో తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున సీటు ఇప్పించారు.
ఇక అప్పటి నుంచి కొడాలి నాని వరుసగా నాలుగుసార్లు గుడివాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009ల్లో టీడీపీ తరపున, 2014, 2019ల్లో వైసీపీ తరఫున కొడాలి నాని గెలుపు బావుటా ఎగురవేశారు. ఇప్పుడు ఐదోసారి వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు.
ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం ద్వారా కొడాలి నాని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా విమర్శలకంటే బూతులు తిడతారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కొడాలి నానిని ఓడించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు.. వెనిగండ్ల రాము రూపంలో గట్టి అభ్యర్థినే బరిలో దింపారు.
నాలుగు పర్యాయాలు సులువుగానే గెలిచిన కొడాలి నాని ఈసారి విజయానికి చెమటోడ్చుతున్నారని టాక్ నడుస్తోంది. టీడీపీకి జనసేన కూడా కలవడం, గతంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవిపై కొడాలి నాని చేసిన పకోడీ గాళ్లు అనే వ్యాఖ్యలతో కాపు సామాజికవర్గం ఈసారి ఆయనకు దూరమైందని అంటున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో 35 వేలకు పైబడి కాపు ఓటర్లు ఉన్నారు. ఈసారి వీరు కొడాలి నాని వైపు లేరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ పైనే ఆధారపడ్డారు. ఆయన అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా గుడివాడ నియోజకవర్గం పరిధిలోకి గుడ్లవల్లేరు మండలం వేమవరంలో కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు.
తనకు పెద్ద ఎన్టీఆర్, వైఎస్సార్ రెండు కళ్లని కొడాలి నాని తెలిపారు. నందమూరి హరికృష్ణ తనకు గురువని వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలో అణగదొక్కుతున్నారని.. ఆయన అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఈ దాడులను చంద్రబాబు, లోకేశ్ ఖండించడం లేదన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేశ్ ను ఓడిస్తేనే టీడీపీ నేతలంతా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వస్తారని.. పార్టీ ఆయన చేతుల్లోకి వస్తుందని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు జూనియర్ వద్దకు వస్తారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి పార్టీ వచ్చినప్పుడే అభిమానులు ఆ పార్టీకి మద్దతివ్వాలన్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేతిలో ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వవద్దని కోరారు. మరి కొడాలి నాని పిలుపు ఫలిస్తుందో లేదో ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.