కోడికత్తి కేసులో తాజా వాదనలు వినిపించిన లాయర్ పిచ్చుకుల శ్రీనివాస్ ఎవరు?

విపక్ష నేతగా ఉన్న వేళలో.. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన ఉదంతానికి సంబంధించిన కేసు వాదనలు తాజాగా కోర్టులో జరిగాయి.

Update: 2023-09-30 05:11 GMT

విపక్ష నేతగా ఉన్న వేళలో.. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన ఉదంతానికి సంబంధించిన కేసు వాదనలు తాజాగా కోర్టులో జరిగాయి. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం ఇవ్వటానికి కోర్టుకు రావాలన్న డిమాండ్ ను చేశారు నిందితుడు తరఫు లాయర్. ఈ కేసును వాదనలు వినిపిస్తున్న లాయర్ సలీంకు బదులుగా ఆయన స్థానంలో లాయర్ పిచ్చుకల శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

ఆయన వినిపించిన వాదనలు ఆసక్తికరంగా మారాయి. కోర్టులో సాక్ష్యం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాలేరని.. సీఎం హోదాలో.. పలు సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆయన చాలా బిజీగా ఉన్నట్లుగా ప్రభుత్వం తరఫు న్యాయవాది వెంకటేశ్వరరావు కోరారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కానీ.. అడ్వొకేట్ కమిషన్ ఏర్పాటు కానీ చేయాలన్న వాదనలు వినిపించారు.

దీనిపై నిందితుడు తరఫు న్యాయవాది పిచ్చుకల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. కుమార్తె కోసం లండన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్.. కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు రాలేరా? అని ప్రశ్నించారు. ఈ కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు కోర్టుకు రావాలన్న ఆయన.. ‘‘ఈ కేసులో బాధితుడిగా ఉన్న సాక్షి సీఎం జగన్ సెషన్స్ కోర్టుకు రావాలని ఈ ఏడాది ఏప్రిల్ లో చెబితే.. ఇప్పటివరకు రాకుండా.. ప్రాసిక్యూషన్ కు సహరించకుండా ఉండటం శ్రీనుకు అన్యాయం చేసినట్లే అవుతుంది. కోర్టుకు హాజరయ్యే విషయంలో తాత్సారం చేయటం ధిక్కరణే అవుతుంది. సాక్షి రాని పక్షంలో నిందితుడికి బెయిల్ ఇవ్వొచ్చు. సెషన్స్ కేసులో సీఎం ఒక బాధిత సాక్షి కావటంతో కోర్టుకు హాజరు కావాలి. అలా కాదు.. సాక్షి వద్దకే అడ్వొకేట్ కమిషన్.. నిందితుడు వెళ్లాలనటం మొత్తం న్యాయ విధానాన్నే పక్కన పెట్టినట్లు అవుతుంది’ అంటూ వాదనలు వినిపించారు.

ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని పేర్కొనగా.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ కోర్టుకు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి మురళీక్రిష్ణ విచారణను అక్టోబరు 13కు వాయిదా వేశారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు బెయిల్ ఇచ్చే అంశాన్ని హైకోర్టు రిజెక్టు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. కేసు రుజువైతే పడే శిక్షా కాలం కంటే ఎక్కువ కాలం శ్రీను జైల్లో ఉన్నాడని.. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీం కూడా చెబుతుందని చెబుతున్న లాయర్ పిచ్చుకల శ్రీనివాసరావు వాదనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజా వాదనల నేపథ్యంలో ఆయన ఎవరన్న ఆరా తీస్తే.. సంచలనంగా మారిన అయేషా మీరా కేసులో వాదనలు వినిపిస్తున్నది కూడా ఆయనే అని తేలింది.

Tags:    

Similar News