అసెంబ్లీ ఎన్నికల్లో కోడికత్తి శ్రీను పోటీ?.. ఆ పార్టీలో చేరిక!

జైభీమ్ భారత్ పార్టీలో చేరిన అతడ్ని ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. సోమవారం రాత్రి ఈ పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-03-12 04:40 GMT

గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేయటం.. భుజానికి గాయం కావటం తెలిసిందే. ఈ కేసు అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక కొలిక్కి వచ్చింది లేదు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ప్రధాన ముద్దాయి కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు తాజాగా ఒక రాజకీయ పార్టీలో చేరటం ఆసక్తికరంగా మారింది.

జైభీమ్ భారత్ పార్టీలో చేరిన అతడ్ని ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. సోమవారం రాత్రి ఈ పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రోగ్రాంలో కోడికత్తి శ్రీనుకు కండువాను కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే.. తాజా ఎన్నికల్లో కోడి కత్తి శ్రీను బరిలో నిలుస్తారని చెబుతున్నారు.

అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను బరిలోకి దిగుతారని.. జైభీమ్ భారత్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకాలం దాడి కేసు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ.. సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపిన కోడి కత్తి శ్రీను.. తాను జగన్ వీరాభిమానిగా అభివర్ణించేవారు. తాజాగా రాజకీయ పార్టీలో చేరిన అతగాడు.. రానున్న రోజుల్లో ఏమేం మాట్లాడతారన్నది చూడాలి.

Tags:    

Similar News