సీఎం జగన్‌ పై కత్తి దాడి.. విచారణలో కీలక అప్‌ డేట్‌!

దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్‌ఐఏ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Update: 2023-10-17 16:52 GMT

2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేతపై కోడి కత్తితో విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విచారిస్తోంది.

కాగా తనపై హత్యాయత్నం జరిగిందని ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హైకోర్టులో దాఖలు పిటిషన్‌ పై హైకోర్టు స్టే విధించింది. 6 వారాలపాటు విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

కోడికత్తి కేసులో లోతైన విచారణ జరపాలి అని వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ను ఎన్‌ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో దీన్ని జగన్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్‌ఐఏ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

కాగా.. కోడికత్తి కేసులో ఇంకా లోతైన దర్యాప్తు చేసేలా ఎన్‌ఐఏను ఆదేశించాలని ఐదేళ్ల తర్వాత కోర్టును సీఎం జగన్‌ అభ్యర్ధించారు. విశాఖపట్నం ఎయిర్‌ పోర్టు లాంజ్‌ లో తనపై కోడికత్తి దాడి ఘటనపై లోతైన విచారణ జరిపేలా ఎన్‌ఐఏను ఆదేశించాలని జగన్‌ తన పిటిషన్‌ లో కోరారు.

2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్‌ పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై కోడి కత్తితో దాడి జరిగింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దాడి ఘటనకు సంబంధించి జె.శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తదనంతరం కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తును ప్రారంభించింది. ఇటీవల సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. కోడికత్తి దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్‌ఐఏ కోర్టు తేల్చింది. జగన్‌ పిటిషన్‌ ను ఎన్‌ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో.. ఈ కోర్టు ఉత్తర్వులను జగన్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు.

Tags:    

Similar News