కోహ్లిలా సెంచరీ.. తెలంగాణలో ఏ పార్టీకైనా సీట్లు సాధ్యమా?

ఈ నేపథ్యంలోనే క్రికెట్ లో పరుగుల పరంగా విరాట్ కోహ్లిలా రాజకీయాల్లో సీట్ల సెంచరీ కొట్టడం ఏ పార్టీకైనా సాధ్యమా? అనేది చర్చనీయాంశం అవుతోంది.

Update: 2023-11-08 10:49 GMT

వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి భీకర ఫామ్ లో ఉన్నాడు. ఎనిమిది మ్యాచ్ లలో రండు సెంచరీలు సహా రెండు మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. 500 పైగా పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే రెండుసార్లు సెంచరీ ముంగిట ఆగిపోయాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే అత్యధిక సెంచరీల రికార్డు (49)ను సరిగ్గా తన పుట్టిన రోజు అయిన నవంబరు 5న సమం చేశాడు. మరొక్క సెంచరీ చేస్తే చాలు.. వన్డేల్లో సెంచరీల అర్ధ సెంచరీ మార్కును అందుకుంటాడు. నెదర్లాండ్స్ తో ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్ లోనే దీనిని అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. అప్పుడు సాధ్యం కాకున్నా ,సెమీఫైనల్ లో అయినా, ఫైనల్ చేరితే అక్కడయినా 50వ వన్డే సెంచరీ చేసేస్తాడని అంచనాలు పెట్టుకున్నారు.

కోహ్లి సరే.. మరి తెలంగాణ పార్టీలు?

వన్డేల్లో అయినా టెస్టుల్లో అయినా టి20ల్లో అయినా సెంచరీ అనేది ఓ అపురూపం.. 99 పరుగుల వద్ద ఔటైన ఆటగాడిని అడిగితే తెలుస్తుంది సెంచరీ విలువ ఏమిటో? కాగా, ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ లో పరుగుల పరంగా విరాట్ కోహ్లిలా రాజకీయాల్లో సీట్ల సెంచరీ కొట్టడం ఏ పార్టీకైనా సాధ్యమా? అనేది చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్.. తమ పార్టీ బీఆర్ఎస్ కోహ్లిలా సెంచరీ కొడుతుందంటూ ప్రకటన చేయడం గమనార్హం.

119కి 100 సాధ్యమా?

తెలంగాణ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 119. వీటిలో పాతబస్తీలోని 7 సీట్లను కచ్చితంగా తీసివేయాల్సిందే. మిగిలినవి 112. ఇందులోనే వంద కొట్టాలి. మరి అది సాధ్యమా? నిజంగా చూస్తే ఇది కష్టమే. అసాధారణ వేవ్ ఉంటే తప్ప వంద సీట్లు ఏ పార్టీకీ రావు. అంతెందుకు.. తెలంగాణ ఏర్పాటు ఖరారైన 2014లో వాస్తవానికి కాంగ్రెస్ కు ఫాయిదా దక్కాలి. కాదంటే బీఆర్ఎస్ కు ఊపుండాలి. ఇదేదీ జరగలేదు. బీఆర్ఎస్ గెలిచినా బొటాబొటీగా 63 సీట్లు మాత్రమే దక్కించుకుంది. ఇక 2018 ఎన్నికల్లో తమకు 100 సీట్లపైన వస్తాయంటూ బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేసింది. ముందు ఎవరూ నమ్మకున్నా.. ఫలితాల రోజు మాత్రం సెంచరీ కొట్టేస్తుందా? అనిపించింది. చివరకు 88 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి ఒక్క సీటే సాధించడం, మరికొన్ని నియోజవకర్గాల్లో అనుకోని ఓటమితో బీఆర్ఎస్ సెంచరీ ముంగిట నిలిచిపోయింది.

మరిప్పుడు?

అప్పటి సంగతి పక్కనపెట్టి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఏ పార్టీకీ వంద సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలో ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా.. క్షేత్ర స్థాయిలో ఊపు కనిపిస్తున్న కాంగ్రెస్ తొలిసారిగా అధికారం కోసం పోరాడుతోంది. వీటి మధ్యలో బీజేపీ కొన్ని సీట్లయినా గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఏ లెక్కన చూసినా.. ఎంత వేవ్ వీచినా ఏ పార్టీకీ 80కి మించి సీట్లు రావని అంచనా. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ ఇదే విషయం చెప్పడం గమనార్హం.

కొసమెరుపు: సీట్ల సంఖ్యపరంగా తెలంగాణ చిన్న రాష్ట్రం. కాబట్టి సెంచరీ కొట్టడం అంటే.. చాలా కష్టం. కానీ, అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే కాస్త తేలికనే. గత ఎన్నికల్లో వైఎస్సార్టీపీ 151 సీట్లు గెలిచి దీనిని నిరూపించింది కూడా. అంతకుముందు 2014లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ 117 సీట్లను దక్కించుకుంది.

Tags:    

Similar News