సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!
ఈ సందర్భంగా... "ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఓ దుర్మార్గమైన తీర్పునిచ్చింది.. ఓ అన్యాయమైన తీర్పునిచ్చింది.. ఒక దారుణమైన తీర్పునిచ్చింది..
రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఒక వర్గంలో తీవ్ర చర్చ జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆ తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సుప్రీంకోర్టు అన్యాయమైన తీర్పు ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు!
అవును... ఇటీవల పుదుచ్చేరికి చెందిన సెల్వరాణి అనే మహిళ కేసులో మద్రసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. క్రైస్తవ మతంలోకి మారిన మహిళకు షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయడానికి మద్రాసు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడాన్ని సమర్థించింది.
ఈ తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు... ప్రభుత్వ ఉద్యోగం కోసం రిజర్వేషన్ ప్రయోజనాని దక్కించుకునే క్రమంలో సదరు మహిళ తాను హిందువనని పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. ఇతర మత విశ్వాసాలను అనుసరిస్తూ, రిజర్వేషన్ ప్రయోజనాల కోసం హిందువునని చెప్పుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమే అని ఘాటుగా స్పందించింది.
ఇదే సమయంలో... మతపరమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్స్ కోసమే మరో మతానికి సంబంధించిన వాళ్లమని చెప్పుకోవడాన్ని తాము అనుమతించమని.. పిటిషనర్ సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని నిర్ధారణ అయ్యిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ తీర్పుపై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి స్పందించారు.
ఈ సందర్భంగా... "ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఓ దుర్మార్గమైన తీర్పునిచ్చింది.. ఓ అన్యాయమైన తీర్పునిచ్చింది.. ఒక దారుణమైన తీర్పునిచ్చింది.. అదేమిటంటే.. ఈ దేశంలో సామాజికంగా వెనుకబడిన కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇస్తే... ఈ రోజు సుప్రీంకోర్టు ఏమి చెప్పిందంటే.. క్రైస్తవులైతే రిజర్వేషన్లు ఉండవని చెప్పింది" అని అన్నారు.
ఇదే సమయంలో... "రాజ్యాంగం రిజరేషన్స్ ఇచ్చింది కులానికి.. దాన్ని మతంతో లింకుపెట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. ఎవరు తీర్పు చెప్పినా.. అది తప్పు.. దానికి వ్యతిరేకంగా మనం అంతా నిలబడి పోరాడాలి" అని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి!