కొల్‌కతా వైద్యురాలి హత్యాచారం వెనుక పోలీసు మాజీ వలంటీర్!
గతంలో గర్భవతిగా ఉన్న తన భార్యపైనా సంజయ్ రాయ్ దాడికిపాల్పడినట్టు కేసు నమోదైంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్‌కతాలోని `ఆర్‌జీ కార్` మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, అనంతర హత్య వెనుక బీహార్‌కు చెందిన పోలీసు మాజీ వలంటీర్ ఉన్నట్టు తెలిసింది. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన సంజయ్ రాయ్ అనే వ్యక్తి కొల్‌కతా పోలీసు విభాగంలో పౌర సేవల వలంటీర్(హోంగార్డు మాదిరి) పనిచేస్తున్నాడు. ఈయనే జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేశారనేది ప్రస్తుతం వెలుగు చూసిన విషయం. దీంతో రాయ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గతంలో గర్భవతిగా ఉన్న తన భార్యపైనా సంజయ్ రాయ్ దాడికిపాల్పడినట్టు కేసు నమోదైంది.
మరిన్ని సంచలన విషయాలు..
మరోవైపు అత్యాచారం, హత్యకు గురైన కొల్‌కతా జూనియర్ డాక్టర్ విషయంలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఈ ఘటనను సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. దర్యాప్తు అధికారులు చెప్పిన వివరాల మేరకు.. జూనియర్ డాక్టర్‌పై ఒకరు కాదు.. సామూహికంగా.. మరికొందరు అత్యాచారం చేసినట్టు తెలిసింది. పోస్టు మార్టమ్ రిపోర్టులో మృతదేహంలో అధిక మొత్తంలో వీర్యాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు.
కాగా, అత్యాచారానికి ముందు జూనియర్ డాక్టర్‌ను తీవ్రంగా హింసించినట్టు తెలిసింది. రహస్య అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని, ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు వైద్యుల నివేదికలో వెల్లడైంది. ఇది అత్యంత దారుణ ఘటనగా వైద్యులు తెలిపారు. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు తెలిపారు. దీంతో మృతురాలిపై ఒకరికి మించి ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఒక్కరి నుంచే అంత రాదు!
పోస్టు మార్టమ్‌లో నిపుణులైన వైద్యుల్లో ఒకరు మాట్లాడుతూ.. ఒక్కరే అత్యాచారం చేస్తే.. 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉండే అవకాశం లేదని.. ఒక్కరి నుంచి అంత మొత్తంగా రిలీజ్ కాదని పేర్కొన్నారు. దీని వెనుక సామూహిక ఘటన ఉండి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై మృతురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.