స్కూల్లో టాపర్.. కోల్ కతా కామపిశాచి గురించి తల్లి ఏం చెప్పింది?
హత్యాచార ఉదంతంలో ప్రధాన నిందితుడైన సంజయ్ కు కఠిన శిక్ష విధించాలని కోరిన అతడి తల్లి.. ఈసారి తనకు అతడు ఎదురైతే.. ఎందుకిలా?
పీజీ వైద్య విద్యార్థిని అత్యంత దారుణంగా హత్యాచారం చేసిన సంజయ్ రాయ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతగాడి దురాగతం దేశాన్ని.. దేశ ప్రజల్ని కదిలించేసింది. అతడికి కఠిన శిక్ష విధించాలని కోరుతూ ఇప్పటికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్లో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతం దేశ ప్రజల్ని షాక్ కు గురి చేసింది. ఇప్పటికే నిందితుడి అత్త మీడియాతో మాట్లాడటం తెలిసిందే. తాజాగా అతడి తల్లిని కలిసిన మీడియా కారణంగా.. అతడికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
హత్యాచార ఉదంతంలో ప్రధాన నిందితుడైన సంజయ్ కు కఠిన శిక్ష విధించాలని కోరిన అతడి తల్లి.. ఈసారి తనకు అతడు ఎదురైతే.. ఎందుకిలా? చేశావని అడగాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తాను తన కుమారుడితో కఠినంగా వ్యవహరించి ఉండి ఉంటే.. అతను ఈ విధంగా వ్యవహరించి ఉండేవాడు కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేయటం గమనార్హం. తన భర్త అంటే సంజయ్ కు విపరీతమైన గౌరవంగా ఉండేవాడన్నారు. అదే సమయంలో అతడి విషయంలో అతడి తండ్రి కఠినంగా ఉండేవారని పేర్కొన్నారు. తన తండ్రి అంటే సంజయ్ కు చాలా గౌరవమన్న ఆమె.."నా భర్త చనిపోవటంతో అంతా తలకిందులైంది. తమ అందమైన కుటుంబం కాస్తా చిన్నాభిన్నమైంది. ఒక గుర్తుగా మిగిలిపోయింది"అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సంజయ్ ను ఈ తరహాలో ఎవరు ప్రభావితం చేశారో తెలీదన్న అతడి తల్లి.. "చిన్నతనంలో సంజయ్ కు ఆటలంటే చాలా ఇష్టం. బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. ఎన్ సీసీలో చేరాడు. స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఇంట్లో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. వంట కూడా చేసి పెడతాడు. ఇరుగుపొరుగు వారితో సంజయ్ ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించేవాడు" అని పేర్కొన్నారు.
అలాంటి తన కొడుకు ఇంతటి దారుణానికి ఎలా పాల్పడ్డాడో.. తనకు అర్థం కావట్లేదన్నారు. సంజయ్ మొదటి భార్య క్యాన్సర్ తో మరణించిందని.. ఆ తర్వాత అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు చెప్పారు. ఆ సమయంలోనే మద్యానికి బానిస అయినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. ఆర్జీకరర్ మెడికల్ కాలేజీలో ఘటన జరిగిన రోజు రాత్రి అతనేమీ తినలేదన్నారు. ఆసుపత్రిలో పని చేస్తున్న విషయం తనకు తెలీదన్న ఆమె మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.