టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్... స్పందించిన మంత్రి కొలుసు!

ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సంచలన పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-17 10:30 GMT

ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సంచలన పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ వేదికపై టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ దర్శనమిచ్చారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే, నేతలతో ఒకే వాహనంపై ర్యాలీలోనూ పాల్గొన్నారు.

దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంతో... జోగి రమేష్ టీడీపీలోకి వెళ్తున్నారా అనే చర్చ మొదలైంది. మరోపక్క తమ పార్టీ కార్యక్రమంలో వైసీపీ నేత సందడి ఏమిటి అంటూ టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారని.. ఆగ్రహంతో ఉన్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో మంత్రి పార్థసారథి స్పందించారు.

అవును... నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొన్న ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ.. దీనిపై అధిష్టాణం ఆగ్రహం వ్యక్తం చేయడం.. లోకేష్ దీనిపై వివరణ కోరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి పార్థసారథి.. టీడీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... చంద్రబాబు, లోకేష్ లు తనకు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పుడూ మరిచిపోనని.. టీడీపీ సిద్ధాంతలను దెబ్బతీసే వ్యక్తిని కాదని.. మరోసారి ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడతానని.. వ్యక్తిగతంగా జోగి రమేష్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి పార్థసారథి తెలిపారు.

కాగా... గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్.. చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తితో.. మంత్రి కొలుసు పార్థసారథి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే గౌతు శిరీష వేదిక పంచుకోవడంపై... టీడీపీ శ్రేణులు మండిపడిన సంగతి తెలిసిందే.

దీంతో... జోగి రమేష్ టీడీపీలో చేరబోతున్నారా.. ఈ మేరకు పార్థసారథి పావులు కదపబోతున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది. మరోపక్క.. జోగి రమేష్ వ్యవహారంపై అటు వైసీపీలోనూ చర్చ జరిగిందని అంటున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై జోగి నుంచి ఇంకా రియాక్షన్ రానప్పటికీ... టీడీపీ కార్యకర్తలకు మంత్రి కొలుసు మాత్రం సారీ చెప్పారు.

Tags:    

Similar News