సొంత పార్టీపై సెటైర్లు.. కాకరేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?
తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రెండో రకానికి చెందినవిగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందుకే నేతలు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేస్తుంటారు. తామే హైకమాండ్ అనుకుంటారు. సీఎం, మంత్రి పదవులను తామే డిసైడ్ చేస్తామనే ఫీలింగే హస్తం నేతలు ఇష్టానుసారం మట్లాడటానికి కారణమంటారు. కొన్నిసార్లు నేతల మాటలు ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా మారితే మరికొన్నిసార్లు అవే అశనిపాతమవుతున్నాయి. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రెండో రకానికి చెందినవిగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బిందెడు పాలలో చుక్క విషం కలిపితే ఏమవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనే చూస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో అత్యద్భుత విజయం అందుకున్న కాంగ్రెస్ పార్టీ.. అంతులేని ఆర్థిక కష్టాలను కూడా లెక్క చేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. తన మార్కు సెటైర్ తో 13 నెలల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మార్చేశారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో మంత్రి ఉత్తమ్ కాబోయే సీఎం అంటూ అగ్గి పుట్టించిన సదరు నేత.. తాజాగా కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ నే జనం మెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించి కాకపుట్టించారు. దట్టమైన మంచుతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తెలంగాణలో కోమటిరెడ్డి రగిల్చిన వేడి ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమటలు పట్టించిందని అంటున్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో ఎప్పుడూ హాట్ లీడర్స్. ఈ ఇద్దరిదీ ఆ పార్టీలో సెపరేట్ రాజ్యాంగం. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికలతో హీట్ తెప్పించారు. ఆ సమయంలో కాంగ్రెస్లో ఉంటూనే తన తమ్ముడికి ఓటు వేయాలని ప్రచారం చేసిన ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశారు. ఇక గత ఎన్నికల ముందు తిరిగి సొంత గూటికి చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎన్నికల అనంతరం మంత్రి పదవిని ఆశించారు. అయితే ఆయన అన్నకు మంత్రి పదవి ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డికి అవకాశం లభించలేదు.
తొలివిడతలో మంత్రి పదవి దక్కకపోయినా, రెండో విడతలో మంత్రి అవుతాననే ఆశతో ఇన్నాళ్లు వేచిచూసిన రాజగోపాల్ రెడ్డిలో ప్రస్టేషన్ రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం, ఇచ్చినా తనకు రానీయకుండా ఓ వర్గం ప్రయత్నిస్తోందనే అనుమానంతో పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరయ్యాలనే ఆలోచనకు ఆయన వచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా, ఒకేసారి నాలుగు పథకాలను ప్రారంభించి ప్రజల్లో గొప్పగా తీసుకువెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే గాలి తీసినట్లు వ్యాఖ్యానించడం ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. రైతు భరోసా పేరు చెప్పి ఓ ఏడాది ఎగ్గొట్టినం, రైతు కూలీలకు సాయం చేయడానికి నిబంధనల సాకు చూపుతున్నాం.. రుణ మాఫీ చేసినా అంతా కేసీఆర్ పాలననే మెచ్చుకుంటున్నారు.. అంటూ రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీలో కుదుపు తీసుకువచ్చింది.
సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారే ఈ విధంగా వ్యవహరిస్తే ప్రతిపక్షానికి స్వయంగా అస్త్రాలు అందించిన వారమవుతున్నామని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవి రాలేదని ఏదైనా అసంతృప్తి ఉంటే అధిష్టానంతో తేల్చుకోవాలని.. ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం సరికాదంటున్నారు. ఏదిఏమైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలి కాంగ్రెస్లో కాకరేపుతోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమండ్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సివుంది.