వైరల్ వీడియో... మాధవరెడ్డి కొడుకును గెంటేయించిన కోమటిరెడ్డి!
ఈ క్రమంలో తన మాటలు, చేష్టలతో మంత్రి కోమటిరెడ్డి మరోసారి చర్చనీయాశంగా మారారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అటో మెటిక్ గా ఆ లక్షణాలు వచ్చేస్తాయో ఏమో కానీ... చాలామంది నేతలు గతాన్ని మరిచిపోతుంటారు..! మరికొంతమంది గతంలో తమకు కలిగి ఇబ్బందులు తమవల్ల మరొకరికి కలగకూడదని భావిస్తుంటారు..! ఇప్పుడు అలాంటినేతలు అరుదైపోయారు అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
అవును... రైతుబంధు అడిగిన వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన మాటలు, చేష్టలతో మంత్రి కోమటిరెడ్డి మరోసారి చర్చనీయాశంగా మారారు. ప్రజాపాలన సభలో తన పక్కనే కూర్చున్న జడ్పీ ఛైర్మన్ ను తన మాటలతో అవమానించటమే కాకుండా.. అతడిని బయటకు గెంటెయాలని పోలీసులకు హుకూం జారీ చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా గూడురులో నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి ప్రసంగిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇందులో భాగంగా.. రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా కేటీ ర్ సరిపోరంటూ విమర్శించారు.
అక్కడితో ఆగని కోమటిరెడ్డి... వేదికపై తన పక్కన కూర్చున్న జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గురించి ప్రస్థావిస్తూ... ఎలిమినేటి మాధవరెడ్డి ఓ మహానాయకుడని, ఆయన పేరు చెప్పుకుని జెడ్పీటీసీ అయ్యాడు తప్ప.. ఆయన సర్పంచ్ గా కూడా పనికిరాడంటూ తక్కువ చేసి మాట్లాడారు! దీంతో... అప్పటివరకూ కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించినప్పటికీ ఓపికతో సహించిన సందీప్ రెడ్డి.. తనను కూడా వ్యక్తిగతంగా కించపర్చటంతో ఒక్కసారిగా పైకి లేచి ఫైరయ్యరు.
ఈ సందర్భంగా... ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటివి మాట్లాడటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచిన కోమటిరెడ్డి.. ఇతన్ని బయటకు వెళ్లగొట్టండయ్యా అంటూ హుకూం జారీ చేశారు. దీంతో... పోలీసులు సందీప్ రెడ్డిని బలవంతంగా వేదిక నుంచి కిందికి దింపేశారు. దీంతో... కాంగ్రెస్, బీఆరెస్స్ కార్యకర్తల హోరాహోరి నినాదాలతో సమావేశం ఉద్రిక్తతంగా మారింది. ఈ విషయంపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!!
ఇదేనా ప్రజాపాలన?:
దీంతో... ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్న నేపథ్యంలో... మాజీ మంత్రి హరీశ్ రావు ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీసులకు హుకుం జారీచేసిన సంఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన హరీశ్ రావు... "కాంగ్రెస్ 'ప్రజాపాలన'లో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయం.. ఇదేనా ప్రజాపాలన?" అని స్పందించారు.
ఇదే సమయంలో... "మొన్న రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నేడు యాదాద్రి భువనగిరి జెడ్పి ఛైర్మన్ సందీప్ రెడ్డి పై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాషలాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం.. ప్రజాస్వామ్య వాదులంతా కోమటి రెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలి. కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా.. సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలి" అని డిమాండ్ చేశారు.