పదేళ్ళలో కచ్చితంగా ఏదో ఒక రోజున తాను సీఎం అవ్వుతాను!
తెలంగాణాలో కాంగ్రెస్ విజయావకాశాలు బాగా పెరుగుతున్నాయి. పోలింగ్ కి గడువు దగ్గపడుతున్న కొద్దీ స్పష్టత అయితే వస్తోంది.
తెలంగాణాలో కాంగ్రెస్ విజయావకాశాలు బాగా పెరుగుతున్నాయి. పోలింగ్ కి గడువు దగ్గపడుతున్న కొద్దీ స్పష్టత అయితే వస్తోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ లో సీఎం రేసు కూడా సమాంతరంగా సాగుతోంది. మనసులో మాట పేరుతో ఒక్కొక్కరు బయటపడిపోతున్నారు
చిత్రమేంటి అంటే రేపే సీఎం అవుతాను అని అనడం లేదు. మాకూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మేమూ ముఖ్యమంత్రులం అవుతామని చాలా జాగ్రత్తగానే చెబుతున్నారు. ముందుగా ఈ మనసులోని మాటను మొదలెట్టింది సీనియర్ మోస్ట్ నేత కె జానారెడ్డి.
ఆయన చాలా రోజుల క్రితమే చెప్పేసారు. నేనూ సీఎం కావచ్చు అని. తాను దాదాపుగా యాభై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నానని, అత్యధిక కాలం మంత్రిగా ఉన్నానని, ఒక్క సీఎం పదవి తప్ప అన్ని శాఖలను నిర్వహించామని అన్నారు. సో తనకు సీఎం అవకాశం కచ్చితంగా వస్తుందని ఆయన చెప్పేసుకున్నారు
ఆ తరువాత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పదేళ్ల సుదీర్ఘమైన టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారు. రానున్న పదేళ్లలో ఏదో నాటికి నేను సీఎం అయి తీరుతాను ఇది రాసి పెట్టుకోండి అని ఆయన మనసు విప్పి చెప్పారు. సో జగ్గారెడ్డి కూడా రేసులో ఉన్నట్లే.
ఇపుడు మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు. ఆయన నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతాను అని చాలా ధీమాగా చెప్పుకున్నారు. ఆయన మంగళవారం నల్గొండ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ నుంచి ముఖ్యమంత్రి వస్తారని సంచలన ప్రకటన చేశారు.
అయితే రేపో మాపో సీఎం కావాలని ఆత్రుత అయితే తనకు లేదని కూడా చెప్పుకున్నారు. ఆయన కూడా పదేళ్ళ టైం బ్యాండ్ ప్రోగ్రాం సీఎం పోస్ట్ కోసం ప్రకటించారు. పదేళ్ళలో కచ్చితంగా ఏదో ఒక రోజున తాను సీఎం అవడం ఖాయమని అన్నారు.
ఇదిలా ఉంటే కోమటిరెడ్డి చేసిన ఈ ప్రకటన ఇపుడు కాంగ్రెస్ తో పాటు బయటా తెగ వైరల్ అవుతోంది. నిజానికి కాంగ్రెస్ ఈ దఫా అధికారంలోకి రావాలి. అది ఫస్ట్ జరగాలి. ఆ తరువాత అయిదేళ్ళూ పాలించి ప్రజల మన్నన పొందితే మరో అయిదేళ్ళు అవకాశం వస్తుంది.
కానీ కాంగ్రెస్ నాయకులు పంచ వర్ష ప్రణాళికల మాదిరిగా పదేళ్ళ సీఎం ప్రణాళికలను ముందు పెట్టుకుని మాట్లాడడం పట్ల సెటైర్లు పడుతున్నాయి. ముందు రేపటి ఎన్నికల సంగతిని చూడమని కూడా సలహా సూచనలు అందుతున్నాయి. ముందు ఈ రోజు కాంగ్రెస్ బండి లాగితే గెలిపిస్తే ఆనక ముఖ్యమంత్రి సంగతి చూడవచ్చు అని అంటున్నారు.
ఆదికి ముందే ఆర్భాటం చేసుకుంటూ పోతే ప్రతీ వారూ తమ మనసులోని సీఎం కోరికను బయటకు తీస్తే చివరకు నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే సుమా అని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీఎం ల జాబితాను బీయారెస్ ఆయుధంగా మార్చుకుంటోంది. చూశారా ఎంత పెద్ద లిస్టు అక్కడ ఉందో. ఇక ప్రజలను ఏమి పాలిస్తారు అని బీయారెస్ నేతలు ఎండగడుతున్నారు. అయినా కూడా రోజుకొక నేత తానే సీఎం అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం మాత్రం నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. దటీజ్ కాంగ్రెస్ అనుకోవాలేమో.