ఏపీలో మళ్లీ జగనే... తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబందించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు శనివారం సాయంత్రం విడుదలై హల్ చల్ చేశాయి

Update: 2024-06-02 04:00 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబందించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు శనివారం సాయంత్రం విడుదలై హల్ చల్ చేశాయి. ఈ సందర్భంగా... నిన్నటి వరకూ ఉన్న తమ నమ్మకాన్ని ఈ ఫలితాలు వమ్ము చేశాయని కొందరంటే.. ఇవే ఎగ్జాట్ ఫలితాలు కాబోతున్నాయని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సందడి నడుమ తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మళ్లీ వైసీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా.. ఏపీలో మళ్లీ వైసీపీయే అని అన్నారు. ఇలా కాంగ్రెస్ నేత అయ్యి, ఏపీలో ఈసారి వైసీపీకి.. కాంగ్రెస్ కు మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరినప్పటికీ... వైసీపీ విజయమే ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇలా ఏపీలో వైసీపీదే విజయం అని చెప్పడానికి గల కారణం.. తన బంధువులు, స్నేహితులు ఇచ్చిన సమాచారమే అని తెలిపారు. ఇలా తనకొచ్చిన సమాచారం మేరకు ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... రాబోయే రోజుల్లో ఏపీలో షర్మిళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తాము కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

అనంతరం తెలంగాణ ఫలితాలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీఆరెస్స్ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానంతో సహా 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమాగా చెప్పారు. ఇదే సమయంలో... రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News