జనసేనలోకి కొణతాల అనకాపల్లి ఎంపీగా పోటీ!
ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ఉత్తరాంధ్రా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
జనసేన పార్టీలోకి ఒక బిగ్ షాట్ చేరబోతోంది. ఉత్తరాంధ్రా జిల్లాలలో కీలక నేత, మాజీ మంత్రి అయిన కొణతాల రామక్రిష్ణ జనసేనలో చేరుతున్నట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. బుధవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలసి దీని మీద చర్చించారు.
ఒక మంచి రోజు చూసుకుని జనసేన కండువా కప్పుకోవడానికి కొణతాల రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ఉత్తరాంధ్రా రాజకీయాల్లో సంచలనంగా మారింది.కొణతాల జనసేనలోకి వెళ్ళడం అనూహ్యమైన పరిణామంగా చూస్తున్నారు.
మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన కొణతాల 1989లో తొలిసారి అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుని క్రియేట్ చేశారు. ఆ తరువాత ఆయన 1991లో మరోసారి అదే సీటు నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు.
ఇక 2004లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ మంత్రివర్గంలో కీలక మంత్రిగా అయిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. 2009లో ఆయన అనకాపల్లి నుంచి ఓటమి చూసారు. గట్టిగా చెప్పాలంటే పదిహేనేళ్ల పాటుగా ఆయన ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఈ మధ్యలో వైసీపీ టీడీపీ లో కూడా పనిచేశారు.
అలాగే చూసుకుంటే కనుక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొణతాల రాజకీయాలకు నాలుగున్నరేళ్ళ పాటు దూరం అయ్యారు. ఇటీవల ఆయన మీడియా ముందుకు వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేసారు. దాంతో ఆయన మళ్లీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారు అని అంతా అనుకున్నారు
అయితే ఆయన టీడీపీ జనసేనలలో దేంట్లో చేరుతారు అన్న చర్చ ఉంటూనే ఉంది. అయితే ఇపుడు కొణతాల జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించడంతో ఆ సస్పెన్స్ కి తెర వీడింది. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కొణతాల ఆసక్తిని చూపుతున్నట్లు చెబుతున్నారు.
ఇక జనసేనకు అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించవచ్చు అని వార్తలు వస్తున్నాయి.దాంతో ఆయన జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నారు అని అంటున్నారు. అనకాపల్లి రాజకీయాల్లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో కొణతాలకు రాజకీయ వైరం ఉంది. దాడి కొద్ది రోజుల ముందే టీడీపీలో చేరిపోయారు.
దాంతో కొణతాల జనసేన రూట్ ఎంచుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ ఇద్దరు మాజీ మంత్రులు తన రాజకీయాలను మరోసారి పరీక్షించుకునేందుకు చూస్తున్నారు. ఆయా పార్టీలు ఎంతమేరకు అవకాశం ఇస్తాయన్నది చూడాల్సి ఉంది.