వైఎస్సార్ సన్నిహిత మిత్రుడు జనసేనలోకి...!?

వైసెస్సార్ ని అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఉంటూ ఆయన క్యాబినెట్ లో అయిదేళ్ళ పాటు ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రిగా ఏకచత్రాధిపత్యం తో పాలించిన కొణతాల రామక్రిష్ణ జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Update: 2024-01-13 12:30 GMT

వైసెస్సార్ ని అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఉంటూ ఆయన క్యాబినెట్ లో అయిదేళ్ళ పాటు ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రిగా ఏకచత్రాధిపత్యం తో పాలించిన కొణతాల రామక్రిష్ణ జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కొణతాల కలసి చర్చలు జరిపారు అని ప్రచారం సాగుతోంది. ఆయన మంచి ముహూర్తం చూసుకుని జనసేన తీర్థం తీసుకుంటారు అని అంటున్నారు.

ఇక కొణతాల రామక్రిష్ణ రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన కాంగ్రెస్ లోనే తన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1989లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో నాటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ అప్పల నరసిహం మీద గెలిచి గిన్నిస్ రికార్డుకు ఎక్కారు. ఆ తరువాత 1991లో రెండవసారి గెలిచి అయిదేళ్ళ పాటు ఆ పదవిలో ఉన్నారు.

ఇక 2004లో ఆయన అనకాపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహించారు. 2009లో మంత్రిగా ఉంటూ ఓడిన కొణతాల వైఎస్సార్ మరణంతో జగన్ వైపు వచ్చారు. వైసీపీలో మొదట్లో ఆయన కీలక భూమిక పోషించినా 2014 తరువాత ఆ పార్టీకి దూరం అయ్యారు. తిరిగి 2019లో ఆయన వైసీపీలో చేరాలని చూసినా ఎందుకో కుదరలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించిన కొణతాల గత అయిదేళ్ళుగా పూర్తిగా అజ్ఞాత వాసంలో ఉన్నారు.

ఇక 2024 ఎన్నికలు ముందుకు వస్తున్న వేళ కొణతాల తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని కొణతాలను ఆయన అనుచరులు వత్తిడి తెస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకు అనకాపల్లి సీటు ఇస్తుందని ప్రచారంలో ఉంది.

దాంతో కొణతాల జనసేనలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు అని అంటున్నారు. కొణతాల అనకాపల్లిలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. సౌమ్యుడిగా వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. ఆయన జనసేనలో చేరడం ఆ పార్టీకి బలంగా మారుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే అనకాపల్లి రాజకీయాల్లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు కొణతాలకు మధ్య రాజకీయ వైరం ఉంది.

ఇద్దరూ ఒకే పార్టీలో ఉండరు. దాడి వైసీపీలో చేరితే కొణతాల తప్పుకున్నారు. ఇక దాడి టీడీపీలో ఉన్నారు. దాంతో కొణతాల జనసేనలోకి వెళ్తున్నారు అని కూడా అంటున్నారు. ఒకనాడు పోటాపోటీగా రాజకీయాలు నెరపిన ఈ ఇద్దరు నేతలు ఇపుడు రాజకీయంగా మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. ఆయా పార్టీల ద్వారా వారి కోరికలు ఎంతమరకు నెరవేరుతాయన్నది చూడాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News