గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్.. కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది కుసంస్కారుల సోషల్ మీడియా ట్రోలింగ్ కి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న తెనాలికి చెందిన గీతాంజలి గురించి తెలిసిందే. ఇటీవల ఆమె మరణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతీ తెలిసిందే. ఈమె ఆత్యహత్య వ్యవహరం రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో తాజాగా ఆమె కుటుంబాన్ని కోన వెంకట్ పరామర్శించారు.
అవును... సోషల్ మీడియా ట్రోలింగ్ కి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న తెనాలికి చెందిన గీతాంజలి కుటుంబాన్ని ప్రముఖ ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇదే సమయంలో ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు కాల్ చేయమని చెప్పిన ఆయన... ఇకపై తనకు నలుగురు కూతుళ్లని వెల్లడించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్ తో చంపేశారని అన్నారు. ఇదే సమయంలో... సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినే అని తెలిపిన ఆయన... ఈ తరహా వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్తచట్టాలను తేవాలని కోరారు.
కాగా... తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇంటిస్థలం, వైఎస్ జగన్ పథకాల్లో కీలకమైన అమ్మ ఒడి వంటి పథకాలు వచ్చాయని, ఈ సమయంలో తన సొంతింటికల కూడా నెరవేరిందంటూ గీతాంజలి ఒక ఇంటర్వ్యూలో సంబరంగా తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో... ఆమెను కొంతమంది సోషల్ మీడియా జనాలు అసభ్య పదజాలంతో దూషించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆమెపై పోస్టులు పెడుతూ చెప్పలేని రీతిలో ట్రోల్స్ చేశారు.
దీంతో... తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి రైలు కిందపడి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించింది. దీంతో... ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. మరోపక్క ఆమె మృతికి కారకులైన ఎవరినీ విడిచిపెట్టకూడదంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు పెరిగాయి! ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని తాజాగా కోన వెంకట్ ప్రకటించారు.