మంత్రి పెద్దిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు!
ఏపీలోని అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం అక్కడక్కడా చినికి చినికి గాలివానగా మారుతున్నట్లుగా ఉంది
ఏపీలోని అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం అక్కడక్కడా చినికి చినికి గాలివానగా మారుతున్నట్లుగా ఉంది. ఈ విషయంలో జగన్ నిర్ణయాలు నచ్చనివారు, ఆ నిర్ణయాలతో ఏకీభవించనివారూ పార్టీని వీడి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొంతమంది పక్కపార్టీల్లో చేరుతుండగా.. మరికొంతమంది గమ్మున ఉంటున్నారు! ఈ క్రమంలో తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే.. మంత్రి పెద్దిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
అవును... ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల వ్యవహారంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం మీద ఉన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తాజాగా మంత్రి పెద్దిరెడ్డిపై ఫైరయ్యారు. ఇందులో భాగంగా... ఏపీలోని అధికార వైసీపీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు తనకు తెలియకుండా సమావేశం పెట్టడమేమిటని ప్రశ్నించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా స్థానాల్లో ఇలా చేయగలరా అంటూ నిలదీశారు. సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టారని ఆరోపించారు. మంత్రి అక్రమాలన్నింటినీ తనపై తోసి సత్యవేడు నుంచి తప్పించారని ఆరోపించారు.
ఇదే సమయంలో... 1989లో మోటారు సైకిల్ పై తిరిగిన పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడు ఎంత? అని సూటిగా ప్రశ్నించిన ఆయన... ఆయన చేసిన కుట్రలో భాగంగానే తనను ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించి ఎంపీ స్థానానికి పంపిస్తున్నారని విమర్శించారు. ఇష్టం లేకపోయినా తనను తిరుపతి ఎంపీ నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ప్రకటించారని ఆరోపించారు. దీంతో ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
కాగా 2019 ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీచేసిన ఆదిమూలం... టీడీపీ అభ్యర్థి జడ్డా రాజశేఖర్ పై 44,744 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 2014లో అతనికి అదేసీటు ఇవ్వకుండా... తిరుపతి ఎంపీగా పోటీచేయమని సూచించడంతో... అందుకు కారణం పెద్దిరెడ్డి అంటూ ఫైరవుతున్నారు.