ఆరుసార్లు ఎమ్మెల్యే.. ఈసారి ఎంపీ బరిలో!
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కొప్పుల ఈశ్వర్ ఈసారి పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారని తెలుస్తోంది.
కొప్పుల ఈశ్వర్.. పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్‌ఎస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా మేడారం, ధర్మపురి నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏడోసారి 2023 ఎన్నికల్లో ఆయన హవాకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ చేతిలో చిత్తయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కొప్పుల ఈశ్వర్ ఈసారి పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. మరి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు సీటు కేటాయిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే సౌమ్యుడిగా, వివాదరహిత నేతగా, బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న నేతగా పేరున్న కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దించితే పెద్దపల్లిలో విజయం సాధించొచ్చని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన పెద్దపల్లికి ప్రస్తుత ఎంపీగా బీఆర్‌ఎస్ నేత బోర్లకుంట వెంకటేశ్ నేత ఉన్నారు. ఈయనతోపాటు 2014 ఎన్నికల్లో గెలిచిన మాజీ ఎంపీ బాల్క సుమన్ పేరును కూడా పరిశీలిస్తున్నారు.
అయితే ప్రస్తుత ఎంపీ వెంకటేశ్, మాజీ ఎంపీ బాల్క సుమన్ లతో పోలిస్తే కొప్పుల ఈశ్వర్ అయితే గట్టి అభ్యర్థి అవుతారని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్దఎత్తున సింగరేణి కార్మికుల ఓట్లుండటం... ఆయా ప్రాంతాలన్నింటా ఈశ్వర్ కు పట్టుండటం లాభిస్తుందని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు జి.వెంకటస్వామి, జి.వివేక్ గెలుపొందారు. 2014లో వివేక్ మరోసారి బరిలోకి దిగి టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం వివేక్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్క సుమన్ పై వివేక్ గెలుపొందారు.
ఈ నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ అయితేనే పార్లమెంటు ఎన్నికలకు గట్టి అభ్యర్థి అవుతారని బీఆర్‌ఎస్ భావిస్తోందని టాక్ నడుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున వివేక్ కుమారుడు వంశీ బరిలోకి దిగుతారని చర్చ జరుగుతోంది. అలాగే బీజేపీ నుంచి ఎస్. కుమార్ పేరు వినిపిస్తోంది. ఈయన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఇటీవల ఓడిపోయారు.
ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్‌ఎస్ నుంచి అనుభవజ్ఞుడైన కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ నుంచి యువకుడైన వంశీ పోటీ చేస్తే రసవత్తర పోరు జరగడం ఖాయమంటున్నారు.