చదువుకున్న కాలేజీకి ఈ స్థాయిలో విరాళం ఎవరూ ఇచ్చి ఉండరు!

ఆ తర్వాత అమెరికాలో ప్రముఖ వ్యాపార సంస్థ.. హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్‌ కి గ్రూప్‌ ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులైన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

Update: 2024-08-05 06:21 GMT

తమకు చదువు చెప్పి.. విద్యాబుద్ధులు నేర్పి.. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి కారణమైన ఒక విద్యా సంస్థకు ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగు దిగ్గజం.. కృష్ణా చివుకుల కళ్లు చెదిరే మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. తాను చదువుకున్న ఐఐటీ మద్రాస్‌ కు ఏకంగా ఆయన రూ.228 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ లో బాపట్ల కృష్ణా చివుకుల సొంత ఊరు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ.. ఐఐటీ బాంబేలో బీటెక్‌ చదివారు. బీటెక్‌ పూర్తయ్యాక 1970లో మరో ప్రఖ్యాత విద్యా సంస్థ.. ఐఐటీ మద్రాస్‌ లో ఎంటెక్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ఎంటెక్‌ పూర్తయ్యాక కర్ణాటకలోని తుముకూరు యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత ప్రపంచంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ.. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

ఆ తర్వాత అమెరికాలో ప్రముఖ వ్యాపార సంస్థ.. హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్‌ కి గ్రూప్‌ ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులైన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి న్యూయార్క్‌ లో ‘శివ టెక్నాలజీస్‌’ ను ప్రారంభించారు. మాస్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే టాప్‌ సంస్థగా శివ టెక్నాలజీస్‌ పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత భారత్‌ లోనూ వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 1997లో భారత్‌ లో తొలిసారిగా మెటల్‌ ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ (ఎంఐఎం) టెక్నాలజీని కృష్ణా చివుకుల పరిచయం చేశారు. ఒక్క భారత్‌ లోనే తమ వ్యాపారాన్ని రూ.1000 కోట్ల టర్నోవర్‌ కు చేర్చారు.

ప్రస్తుతం కృష్ణా చివుకుల ‘ఇండో యూఎస్‌ ఎంఐఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో నెలకొల్పిన సంస్థకు ఛైర్మన్‌ గా ఉన్నారు. తాను ఎంత స్థాయికి ఎదిగినా దేశంపై మమకారంతో విరాళాలు అందించడంలో తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా తాను ఎంటెక్‌ చదివిన ఐఐటీ మద్రాస్‌ కు ఏకంగా రూ.228 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా అందించి రికార్డు సృష్టించారు.

ఇప్పటికే ఐఐటీ మద్రాస్‌ లో 60 ఏళ్ల క్రితం నిర్మించిన విద్యార్థుల హాస్టళ్లను రూ.5.5 కోట్లతో సర్వాంగ సుందరంగా కృష్ణా చివుకుల తీర్చిదిద్దారు. అలాగే 2014లో ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు.. ఐఐటీ–ఎంశాట్‌ పేరుతో శాటిలైట్‌ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అంతేకాకుండా స్పేస్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు సాయం అందించారు. అదేవిధంగా క్రీడల్లో ప్రతిభ చూపుతున్నవారిని ప్రోత్సహిస్తున్నారు.

ఇవేకాకుండా బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి సైతం కృష్ణా చివుకుల విరాళాలు అందజేశారు. ఇంకా ఎన్నో ఆయన దాతృత్వ ఖాతాలో ఉన్నాయి. ఆయన సేవలకు గుర్తుగా ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే అవార్డులతో సత్కరించాయి.

Tags:    

Similar News