జగన్ మీద బీసీ నేత కృష్ణయ్య వ్యాఖ్యలు విన్నారా ?

వైసీపీ అధినేత నిన్నటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద బీసీ నేత మాజీ ఎంపీ ఆర్ క్రిష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-01 03:51 GMT

వైసీపీ అధినేత నిన్నటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద బీసీ నేత మాజీ ఎంపీ ఆర్ క్రిష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆయనను పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చారు. పెద్దల సభలో కూర్చునే అతి పెద్ద గౌరవం అది. అయినా సరే రెండేళ్ళు మాత్రమే ఆ పదవిలో ఉన్న క్రిష్ణయ్య జగన్ కి కూడా చెప్పకుండా ఒక ఫైన్ మార్నింగ్ ఒక హాట్ డెసిషన్ తీసుకున్నారు. తాను ఎంపీగా ఉన్న పదవిని వదులుకున్నారు. రాజ్యసభకు నమస్కారం పెట్టి వచ్చేశారు.

అయితే దీని మీదనే వైసీపీ నేతలు రగులుతున్నారు. క్రిష్ణయ్య జగన్ కి వెన్నుపోటు పొడిచారు అని కూడా వారు విమర్శిస్తున్నారు. క్రిష్ణయ్య తీసుకున్న నిర్ణయం ఏపీలో కూటమికే మేలు చేసేలా ఉందని అంటున్నారు. అయితే ఎంపీ పదవికి తన రాజీనామాతో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెబుతూ క్రిష్ణయ్య జగన్ మీద కూడా కీలకమైన కామెంట్స్ చేశారు. తాను ఎంపీగా ఉంటే బీసీ ఉద్యమానికే తీరని నష్టం అన్నారు. అందుకే తాను తప్పుకున్నాను అని చెప్పారు.

ఇక తనకు ఆ పదవి కూడా పెద్దగా సంతృప్తి ఇవ్వలేదని ఆయన చెప్పారు. మరో వైపు చూస్తే జగన్ మీద తనకు ఎప్పటికీ ఆ అభిమానం గౌరవం పోదని సంచలన కామెంట్స్ చేశారు. అలాగే వైసీపీ మీద కూడా తనకు ఎలాంటి ద్వేషం లేదని అన్నారు.

జగన్ బీసీల కోసం ఎంతో చేశారు అని కూడా కొనియాడారు. ఆయన బీసీల కోసం ఎన్నో పధకాలను కూడా ప్రవేశపెట్టారు అని కృష్ణయ్య గుర్తు చేశారు. బీసీలకు అధికారం కట్టబెట్టిన ఘనత కచ్చితంగా జగన్ దే అని కూడా అన్నారు. తాను ఎపుడూ జగన్ కి నష్టం చేకూర్చాలని అనుకోలేదని, తాను పదవికి రాజీనామా చేస్తే ఆ సీటు టీడీపీకి వెళ్తునని లెక్కలు కూడా వేసుకోలేదని అన్నారు.

మరో వైపు చూస్తే బీసీ ఉద్యమమే తన లక్ష్యమని కృష్ణయ్య అంటున్నారు. బీసీల ఉద్యమం ఈ మధ్య కాలంలో ఆగిపోయింది అని ఆయన కామెంట్స్ చేశారు. మళ్లీ దానికి ప్రాణం పోస్తానని ఆయన చెబుతున్నారు. అయితే కృష్ణయ్య పార్టీ పెడతారు అని ప్రచారం సాగుతోంది.

దానిని ధృవీకరించేలా క్రిష్ణయ్య కూడా రాజకీయ పార్టీని పెట్టడం ఖాయమన్న తీరులో స్పందించారు. మరి కృష్ణయ్య పెట్టబోయే పార్టీ విధి విధానాలు ఏమిటి ఆయన ఎపుడు పార్టీ పెడతారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ ఉంటుందా లేక తెలంగాణాకే పరిమితం చేస్తారా వంటి ప్రశ్నలకు ఆయనే జవాబు ఇవ్వాలి మొత్తానికి వైసీపీని వీడిపోయిన నాయకులు అంతా జగన్ ని విమర్శిస్తూనే వెళ్లారు.

వైసీపీలో మొదటి నుంచి లేకపోయినా బీసీ నేతగా తనకంటూ ప్రత్యేకత తెచ్చుకున్న కృష్ణయ్య మాత్రం జగన్ ని పొగడడం విశేషమే అని చెప్పాలి. ఆయన జగన్ విషయంలో తన అభిమానం అలాగే ఉందని చెప్పడంతో వైసీపీలోని జగన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News