ఉప ఎన్నికలపై కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్
ఇదిలా ఉండగా.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భగ్గుమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచిన వీరు.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారనేది టాక్. కొందరు అధికారికంగా చేరినప్పటికీ ఇంకా దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దాంతో ఇటీవల రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఏ స్థాయిలో రచ్చ జరిగిందో చూశాం. అందులోనూ.. ఇద్దరు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య వారం రోజుల పాటు యుద్ధమే కొనసాగింది. మరోవైపు.. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టను ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భగ్గుమన్నారు. బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచి చైర్మన్ పదవి తీసుకోవడంపై ఫైర్ అయ్యారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చివరకు కేసుల వరకూ ఈ ఘటన వెళ్లింది. అయితే.. ఫిరాయింపు అంశాన్ని ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపడుతున్నారు. అందులో భాగంగా నలుగురి ఎమ్మెల్యేల విషయంలో ఆయన మరింత సీరియస్‌గా ఉండడంతో ఆయా చోట్ల ఉప ఎన్నికలు తప్పవంటూ చెప్పుకొస్తున్నారు. కౌశిక్ రెడ్డి వివాదం జరిగిన నేపథ్యంలోనూ.. హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల తీర్పునిచ్చిన సందర్భంలోనూ ఆయన ఉప ఎన్నికలు వస్తాయంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన ఉప ఎన్నికల ప్రస్తావనాన్ని తీసుకొచ్చారు. నాలుగు నియోకజవర్గాల అంశాన్ని కాకుండా ఈసారి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆయన టార్గెట్ చేశారు. ఆ నియోజకవర్గానికి తప్పకుండా ఉప ఎన్నిక తప్పదని చెప్పారు. ఈ రోజు ఆయన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నేతలతో సమావేశం కాగా.. వారితో ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో లేనప్పటికీ పార్టీ మీద అభిమానంతో ఇంతమంది సమావేశానికి వచ్చారని, గాంధీకి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఆయన పార్టీ మారిండని ప్రశ్నించారు. రేవంత్ చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ప్రజలు చూస్తున్నారని, ఎక్కువ కాలం ఇది నడవదని జోస్యం చెప్పారు. రైతు భరోసా లేదు.. ముఖ్యమంత్రికి కుర్చీకే భరోసా లేదని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి డ్రామాలు ఆడారని, కానీ నిరుద్యోగులకు మాత్రం ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. దమ్ముంటే ముందు పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల నిర్మాణాలు కూల్చాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అన్నకు ఒక న్యాయం.. పేదలకు ఒక న్యాయమా అని నిలదీశారు.
కేటీఆర్ మరోసారి ఉపఎన్నికల ప్రస్తావన తీసుకురావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందులోనూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల్లో చర్చకు దారితీసింది. ఒకవేళ ఉపఎన్నిక వస్తుందా..? వస్తే మళ్లీ ఎవరు బరిలో నిలుస్తారు..? అంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. కేటీఆర్ వ్యాఖ్యలతో అటు బీఆర్ఎస్ నేతల్లోనూ అదో ఉత్సహం కనిపించింది. మరోసారి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటామని ఆ సమావేశంలో వారు ముక్తకంఠంతో చెప్పినట్లుగా సమాచారం.