కాంగ్రెస్ పై బీఆర్ఎస్ అటాక్ షురూ.. ఫస్ట్ మీడియా మీట్ లో కేటీఆర్ తీవ్ర విమర్శలు..
భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షం హోదాలో ప్రభుత్వంపై ఫైట్ మొదలు పెట్టింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షం హోదాలో ప్రభుత్వంపై ఫైట్ మొదలు పెట్టింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో జరిపిన చర్చాగోష్ఠిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నడపడం అంత తేలికైన విషయం కాదన్న ఆయన ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించారు. ఎన్నికల్లో కళ్లబొల్లి మాటలు చెప్పి కుర్చీ ఎక్కిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదట ఈ గ్యారంటీలను నెరవేర్చడంతో పాటు చట్టబద్దత కల్పిస్తామని, అలాగే రైతు రుణమాఫీపై కూడా హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలకు సంబంధించి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి అధికారం చేపట్టిందన్న కేటీఆర్ ‘అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పింది ఏమైంది? ఏదో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులకు అసలు ఆట ఇప్పుడు మొదలైంది’ అని అన్నారు.
కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తిప్పికొడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 రోజులు కాలేదు. ఇప్పుడే నోరుపారేసుకోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఈ మాత్రం తెలియకుండా పదేళ్లు ఎలా పాలించారని నాయకులు కేటీఆర్ ను వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంపై కొత్త ప్రభుత్వానికి పట్టు రావాలంటేనే కొంత సమయం పట్టదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కేటీఆర్ విమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుందని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది.