తాను మునిగేది కాకుండా ఎదుటోళ్లను ముంచుడేంది కేటీఆర్?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి కావటం తెలిసిందే.

Update: 2024-05-15 04:00 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి కావటం తెలిసిందే. సోమవారం జరిగిన పోలింగ్ మీద ప్రత్యేకంగా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. అయితే..ఆయన నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలతో అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనేలా మారిందన్న మాట వినిపిస్తోంది. తన పార్టీ గురించి చెప్పుకోవాల్సిన కేటీఆర్.. అందుకు భిన్నంగా మరో రెండు పార్టీల గురించి చెబుతూ.. ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిన జోస్యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణలో జరిగిన పోలింగ్ వేళ.. బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మారతాయన్న అంచనా ఏ ఒక్కరూ చెప్పని పరిస్థితి. అందుకు భిన్నంగా కేటీఆర్ మాటల్లో మాత్రం బోలెడంత ఆత్మవిశ్వాసం కనిపించటం ఆసక్తికరంగా మారింది.

ఎన్డీయే.. ఇండియా కూటమిలో లేని మూడు ప్రాంతీయ పార్టీలు కీ రోల్ ప్లేస్ చేస్తాయని జోస్యం పలికారు. సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. కేంద్రం ఏర్పడే ప్రభుత్వంలో బీఆర్ఎస్.. వైసీపీ.. బిజూ జనతాధళ్ లాంటి ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసే పార్టీల మీద కేటీఆర్ ప్రస్తావన ఆయా పార్టీలకు తలనొప్పిగా మారతాయంటున్నారు. తన గురించి తాను చెప్పుకోకుండా.. వేరే వారి గురించి చెప్పటం ద్వారా వారికి ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని పట్టించుకుకోకుండా విశ్లేషణలు చేసిన తీరు చూస్తే.. తాను మునిగింది కాకుండా వేరే వారిని ముంచేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు.

ఆలూ లేదు చూలు లేదన్న సామెత మాదిరి.. ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్న దానిపై ఆయన పార్టీ నేతలు చెబుతున్న దానికి భిన్నమైన వాదన వినిపిస్తున్న సందర్భంలో.. కేటీఆర్ మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అత్యదిక స్థానాల్లో గెలవనున్నట్లుగా ఆయన ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత రానున్న ఫలితంపై ఇంత ఎక్కువగా చేసి చెప్పుకోవటం ద్వారా అభాసుపాలు కావటం మినహా మరేమీ ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. కానీ.. కేటీఆర్ వ్యాఖ్యలు మొత్తం.. పరనింద.. ఆత్మస్తుతి అన్న సామెతకు తగ్గట్లుగా ఉండటం గమనార్హం.

కాంగ్రెస్.. బీజేపీలు రెండు తెలంగాణకు ఏమీ చేయకున్నా అడ్డగోలు విమర్శలు చేశాయని.. వీరివల్ల ఏమీ కాదని ప్రజలకు అర్థమైనట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సరైన నేతలు లేకనే.. తమ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి నిలబెట్టినట్లుగా చెప్పిన కేటీఆర్.. గతంలో తమ పార్టీ కూడా అలాంటి తీరే ప్రదర్శించిందన్న విషయాన్ని ఎలా మర్చిపోతారని చెబుతున్నారు. తమ పార్టీలో కీలకంగా వ్యవహరించే నేతల్లో ఎక్కువమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే అన్న విషయాన్ని వదిలేసి.. నీతులు చెబుతున్న తీరు ఎబ్బెట్టుగా ఉంటుందన్న విషయాన్ని కేటీఆర్ ఎలా మర్చిపోతున్నారు? ఆయన తీరు ఇప్పటికి మారదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News