వేడుకల్లోనూ విసుర్లే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!
ఈ క్రమంలోనూ బీఆర్ ఎస్ నుంచి మాటల తూటాలు పేలాయి.
తెలంగాణలో అధికార, ప్రతిపక్షం మధ్య నిత్యం రాజకీయ వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. ఇటు సర్కారు.. అటు ప్రభుత్వానికి దీటుగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా.. కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనూ బీఆర్ ఎస్ నుంచి మాటల తూటాలు పేలాయి.
వాస్తవానికి.. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజైనా.. నాయకులు, పార్టీలు విమర్శలు లేకుండా ముందుకు సాగుతాయని.. అవతరణ ప్రాధాన్యాన్ని వివరిస్తాయని.. సమస్యలు ప్రస్తాయని తెలంగాణ సమాజం భావించింది. కానీ, దీనికి విరుద్ధంగా.. బీఆర్ ఎస్ నాయకులు మాత్రం విమర్శలు గుప్పించారు. ముఖ్యంగాసీఎం రేవంత్ కేంద్రంగామాటల తూటాలు పేల్చారు.
తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. ``తెలంగాణపై అవగాహన, పరిపక్వత లేని నాయకుడు రేవంత్‌రెడ్డే. చత్తీస్ గఢ్ లో అక్కడి రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులు చేశారు. ఇక్కడ మాత్రం ఒక్క రోజుకే పరిమితం చేశారు`` అని దుయ్యబట్టారు.
అంతేకాదు.. పదేళ్ల తెలంగాణ పండుగను కేవలం ఒక్కరోజులోనే ముగించేలా వ్యవహరించారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ కోసం చేసిన త్యాగాలు.. అమరుల కుటుంబాలు.. వంటివాటిని ప్రభుత్వం విస్మరించిందన్నారు. ``రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ సీఎం. ఆయన పెట్టిన మెసేజ్ లో కనీసం జై తెలంగాణ అనలేదు. ఈయన ఓ మూర్ఖుడు`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదన్నారు.