కేటీఆర్‌ తో జగ్గారెడ్డి భేటీ... పట్టుకొస్తానంటున్న మామిళ్ల!

మంత్రి కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Update: 2023-08-03 09:40 GMT

ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే జంపింగ్ జపాంగులు, అసంతృప్తులు, అలకలు - బుజ్జగింపులతో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. బీఆరెస్స్ మంత్రి కేటీఆర్ ని కలిశారు.

గతం సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ రోజుల్లో ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతల ను బహిరంగంగా కలవడానికే జంకుతున్న పరిస్థితి. ఒక్కసారి ఇతరపార్టీ నేతలతో ఒక రాజకీయ పార్టీ వ్యక్తి కలిసినట్లు పొగ వస్తే చాలు... నిప్పులేకుండా పొగ రాదుగా అంటూ కథనాలు హల్ చల్ చేస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి కీలమైన ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి.. కేటీఆర్ ని కలిశారు.

అవును... మంత్రి కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ చాంబర్‌ లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డితో టీ.ఎన్‌.టీ.వో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కూడా ఉన్నారు.

నిత్యం ప్రజాక్షేత్రం లో ఒకరి పై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకునే వీరిద్దరూ.. అసెంబ్లీ ప్రారంభం కావడానికి ముందు.. అసెంబ్లీ ఆవరణలో కలసి నవ్వుతూ మాట్లాడుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని సంతరించుకుంది. అనంతరం కేటీఆర్ చాంబర్ లో వీరిద్దరూ భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల కోసం వినతి పత్రాన్ని కేటీఆర్ కు అందించారు జగ్గారెడ్డి! మంత్రి కూడా వాటి పై సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పనుల ను పూర్తి చేస్తామని జగ్గారెడ్డికి హామీ ఇచ్చినట్లుగా సమాచారం.

ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి, మామిళ్ల రాజేందర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని అంటున్నారు. "మీ ఇద్దరి దోస్తాన్ ఎక్కడ కుదిరింది" అని కేటీఆర్ అడగ్గా.. "మాది ఒకే కంచం, ఒకే మంచం" అని మామిళ్ల బదులిచ్చారని తెలుస్తోంది. "అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా" అని కేటీఆర్ ప్రశ్నించగా మామిళ్ల ఆసక్తికరమైన సమాధానం చెప్పారని అంటున్నారు.

అవును... సంగారెడ్డి లో జగ్గారెడ్డి గెలుపు పై స్పందించిన మామిళ్ల రాజేందర్... "సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా.. మన దగ్గరకు పట్టుకువస్తా" అని కేటీఆర్‌ తో చెప్పారని అంటున్నారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే ఇది సరదా సంభాషణా.. లేక, మరోకోణం ఉందా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News