తెలంగాణ ఎన్నికలపై బాంబు పేల్చిన కేటీఆర్

జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా 2024 ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Update: 2023-09-12 12:05 GMT

ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారం తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించి సంచలనం రేపారు. మరోవైపు, అధికార పార్టీని గద్దె దింపేందుకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను, అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ బాంబు పేల్చారు. డిసెంబర్ లో ఎన్నికలు జరగకపోవచ్చేమో అని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ నెలలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాకపోతే 6 నెలల తర్వాత ఎన్నికలు ఉండే అవకాశముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

అయితే, త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ వ్యవహారంపై క్లారిటీ వస్తుందని కేటీఆర్ అన్నారు. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా 2024 ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే జమిలి ఎన్నికలతో సంబంధం లేకుండా 90 స్థానాలకు పైగా గెలుస్తామని, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలు వచ్చినా 6 నెలలపాటు తమ ప్రభుత్వమే ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటుందని, మరిన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు.

ఇక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని, రేవంత్ రెడ్డిపై మరే కాంగ్రెస్ నేతపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. జాతీయ పార్టీలు ఢిల్లీ బానిసలని, వాటిని తెలంగాణ ప్రజలు అంగీకరించారని అన్నారు. బానిసలు కావాలో తెలంగాణ బిడ్డ కేసీఆర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి, కెవిపి, షర్మిల ఇలా తెలంగాణ వ్యతిరేకులందరూ ఏకమవుతున్నారని, వారిని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు చాలా క్లారిటీ ఉందని ప్రతిపక్షాలకే లేదని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News