కేటీయారే బాధ్యత వహించాలా ?
చేనేతలు అంటేనే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు సిరిసిల్ల. తెలంగాణా మొత్తం మీద సిరిసిల్లలో చేనేతల మగ్గాలు విపరీతంగా ఉన్నట్లు అర్ధమవుతోంది.
చేనేతలు అంటేనే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు సిరిసిల్ల. తెలంగాణా మొత్తం మీద సిరిసిల్లలో చేనేతల మగ్గాలు విపరీతంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇలాంటి చేనేత పరిశ్రమ ఇపుడు సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేతలను నేసే అవకాశంలేక పాలిస్టర్, కాటన్ బట్టలను నేసే అవకాశం లేక, నేసినా వ్యాపారం జరగకపోవటంతో ఇపుడు వస్త్ర ఉత్పత్తిదారులు దిక్కులు చూస్తున్నారు. ఇదే అదునుగా బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా చేనేతల ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తుండటమే విచిత్రంగా ఉంది.
కేసీయార్ పదేళ్ళ పాలనలో బతుకమ్మ చీరలని చాలా హడావిడి జరిగింది. బతుకమ్మ చీరల పేరుతో అర్హులైన పేదలకు చేనేతల చీరలను నేసే అవకాశం సిరిసిల్లకు ఇస్తున్నట్లు అప్పట్లో ఘనంగా చెప్పుకున్నారు. మొత్తం ఆర్డర్లన్నీ సిరిసిల్లకు మాత్రమే ఎందుకు దక్కినట్లు ? ఎందుకంటే సిరిసిల్ల ఎంఎల్ఏ కేటీయార్ కాబట్టే. కేటీయార్ అప్పట్లో ఎంఎల్ఏ, మంత్రి, డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా మూడు పాత్రలు పోషించారు. కాబట్టి అప్పట్లో బతుకమ్మ చీలర నేతంతా సిరిసిల్లకే దక్కింది. ఇది సంతోషించాల్సిన విషయమనే అనుకుందాం.
అయితే ప్రభుత్వం మారింది కదా సిరిసిల్ల బతుకులు ఏమయ్యాయనే విషయమై ఆరాలు మొదలయ్యాయి. విషయం చూస్తే మేడిపండు లాగ అంతా డొల్లే కనబడుతోంది. విషయం ఏమిటంటే అప్పట్లో సిరిసిల్ల విషయంలో జరిగిన ప్రచారమంతా చాలావరకు కల్పనలే అన్న విషయం బయటపడుతోంది. పేరుకు మాత్రమే చేనేత చీరలు కాని జరిగిన ఉత్పత్తిలో ఎక్కువ భాగం పాలిస్టర్, కాటన్ చీరలేనట. చేనేతల మగ్గాల మీద పాలిస్టర్, కాటన్ బట్టలు నేయడం సాధ్యం కాదు.
అందుకని కొత్తమగ్గాలు తీసుకురావాల్సిందే. అయితే కొత్తమగ్గాలు తీసుకువచ్చేంత ఆర్ధికస్తోమత చేనేతల మగ్గాలు నేసే వాళ్ళకి లేదు. అందుకనే పెద్ద ఆసాములు రంగంలోకి దిగారట. ఆసాములే మగ్గాలు సమకూర్చి చేనేతలతో పనిచేయించారట. అలా జరిగిన వ్యాపారమంతా ఆసాముల జేబుల్లోకే వెళ్ళిపోయింది. ప్రభుత్వం మారటంతోనే బతుకమ్మ చీరలు కూడా మూలనపడ్డాయి. దాంతో చేనేత వస్త్రాలను నేయలేక, పాటిస్టర్, కాటన్ బట్టలు నేయలేక చేనేతలు దిక్కులు చూస్తున్నారట. అందుకనే మంత్రులు మాట్లాడుతు చేనేతల సంక్షోభానికి కేటీయార్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. చేనేతలను ముంచిందే కేటయార్ అని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మండిపోతున్నారు. మరి సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి దారి చూపిస్తుందో చూడాలి.