కవిత అరెస్ట్ ...చంద్రబాబుని ఇరికించేసిన కేటీఆర్ ...!
మాజీ మంత్రి కవిత అన్నయ్య అయిన కేటీఆర్ అయితే ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం మీద మండిపోతున్నారు.
తెలంగాణాలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఆమెను అనూహ్యంగా అరెస్ట్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ కొద్ది గంటలలో వస్తుందనగా ఈడీ ఈ చర్యలకు దిగింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి కవిత అన్నయ్య అయిన కేటీఆర్ అయితే ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం మీద మండిపోతున్నారు.
ఆయన ఏకంగా ఈడీ అధికారులతో వాదనకు కూడా దిగారు అని వార్తలు వచ్చాయి. కవితను ఢిల్లీకి విమానంలో తరలిస్తూంటే కేటీఆర్ కూడా హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసారు. ఇక ఓవర్ టూ ఢిల్లీ అన్నట్లుగా కవిత అరెస్ట్ అంశం ఉంది.
ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ వేశారు. అందులో ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంది. అయితే ఆయన వేసిన ట్వీట్ ఆయనది కాదు ఇప్పటికి అయిదేళ్ల క్రితం అంటే 2019లో చంద్రబాబు బీజేపీతో విభేదించి బయటకు వచ్చి వేసిన ట్వీట్ కి రీట్వీట్.
అందులో ఏముంది అంటే సీబీఐ ఈడీ వంటి సంస్థలను ప్రతిపక్ష నేతలను హింసించేందుకే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటూ వాడుకుంటోందని. చంద్రబాబు ఆనాడు ధర్మ పోరాటం అంటూ బీజేపీ మీద నేరుగా యుద్ధం చేశారు. ఆయన ఎన్డీఏకు గుడ్ బై కొట్టారు. మోడీ అమిత్ షాల మీద కూడా ఘాటైన విమర్శలు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలాని అంటూ దేశమంతా తిరిగి ప్రచారం చేశారు.
అయితే ఇదంతా ఫ్లాష్ బ్యాక్. రీసెంట్ గా చూస్తే వారం రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీలి వెళ్ళి మరీ బీజేపీ పెద్దలతో పొత్తులు కుదుర్చుకుని వచ్చారు. చాలా కాలం తరువాత ప్రధాని మోడీతో ఆయన ఏపీ లోని చిలకలూరిపేట వేదికగా ఒక భారీ సభలో పాలు పంచుకో బోతున్నారు. బీజేపీతో పొత్తుతో బాబు ఉంటే ఇపుడు బాబు చేసిన ట్వీట్ ని బయటకు తీసి కేటీయార్ రీట్వీట్ చేయడమే చర్చనీయంశం అయింది.
రాజకీయంగా కూడా ఇది హాట్ డిస్కషన్ కి దారి తీస్తోంది. పైగా చంద్రబాబు ట్వీట్ ని రీట్వీట్ చేసిన కేటీఆర్ తాను ఇంతకంటే చక్కగా చెప్పలేను అని కూడా పేర్కొన్నారు.అంటే బాబు బీజేపీని వాడిగా వేడిగా విమర్శించారు అనే అర్ధంలోనే కేటీఆర్ మాట్లాడారు.
ఇపుడు బీజేపీ టీడీపీ పొత్తు బంధం మధ్యన కొత్త స్నేహం మధ్యన ఈ హాట్ ట్వీట్ చిచ్చు రేపుతుందా అంటే ఏమో రాజకీయాల్లో అన్నీ అందరికీ గుర్తు ఉంటాయి. సందర్భం వచ్చినపుడు గుర్తు చేసుకుంటారు. అవసరం లేదన్నపుడు కన్వీనియెంట్ గా మరచిపోయినట్లుగా నటిస్తారు. మొత్తానికి బాబు బీజేపీని అన్న మాటలు కేటీఆర్ మరోసారి గుర్తుకు తెచ్చారు అలా ఆయన్ని ఇరికించేసారు అనుకోవచ్చా.ఏమో.