సీరియస్ లవ్ మ్యాటర్.. కూకట్ పల్లి కుర్రాడు సూసైడ్!
మహానగరంగా మారిన హైదరాబాద్ లో అమానుష ఉదంతం చోటు చేసుకుంది. కులం పేరుతో చులకన చేయటమే కాదు
మహానగరంగా మారిన హైదరాబాద్ లో అమానుష ఉదంతం చోటు చేసుకుంది. కులం పేరుతో చులకన చేయటమే కాదు.. నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? అంటూ దాడి చేయటం.. అందరి ముందు అవమానానికి గురి చేసిన ఉదంతంలో ఒక కుర్రాడు బలవన్మరణానికి పాల్పడిన దారుణం చోటు చేసుకుంది. ‘‘తక్కువ కులవోడివి.. మా చెల్లులు కావాల్సి వచ్చిందా? మళ్లీ జోలికి వస్తే.. అంతు చూస్తాం’’ అంటూ దాడి చేయటమే కాదు.. కాసేపటికి సదరు బాధిత కుర్రాడి ఇంటికి వెళ్లి కర్రలు.. రాళ్లతో దాడి చేసి నానా యాగీ చేసిన ఉదంతంలో అవమానానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న దారుణం కూకట్ పల్లిలో చోటు చేసుకుంది.
కూకట్ పల్లి షంషీగూడ పరిధిలోని మహంకాళీనగర్ కు చెందిన చిన్నా.. మరియమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారి పెద్ద కొడుకు సునీల్ డిగ్రీ చదివాడు. వారి ఇంటికి సమీపంలోని 21 ఏళ్ల యువతితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ డిగ్రీ కలిసే చదువుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు.. కుటుంబ సభ్యులు పలుమార్లు సునీల్ తోపాటు వారి ఫ్యామిలీ మెంబర్లతో గొడవ పడ్డారు. అయినా.. వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే వచ్చింది.
ఇదిలా ఉండగా.. గత శుక్రవారం ఇద్దరు సినిమాకు వెళ్లారు. ఈ విషయం యువతి సోదరుడికి తెలిసింది. నిజాంపేటలోని ఒక మద్యం షాపులో ఉన్న సునీల్ ను.. అమ్మాయి సోదరుడు వేణు.. అతని బంధువు భరత్ తో పాటు మరికొందరు అక్కడకు వెళ్లారు. బీరు సీసాతో దాడి చేశారు. దీంతో సునీల్ తలకు గాయమైంది. సమాచారం అందుకున్న కేపీహెచ్ బీ పెట్రోలింగ్ సిబ్బంది ఇరు వర్గాల వారిని సముదాయించి.. బాధితుడ్ని ఆసుపత్రికి పంపారు. చికిత్స తర్వాత సునీల్ ఇంటికి వచ్చాడు.
ఇదిలా ఉండగా రాత్రి 11 గంటల వేళలో.. యువతిని వెంటపెట్టుకొని వచ్చిన అతని సోదరులు.. తల్లి రాజేశ్వరి గొడవకు దిగారు. కులం పేరుతో దూషించటంతో పాటు సునీల్ మీద రాళ్లు.. కర్రలతో ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. దీంతో స్థానికులు సముదాయించి పంపేశారు. యువతి కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని.. కులం పేరుతో తిట్టారంటూ సునీల్ కుటుంబం.. అదే సమయంలో సునీల్ తమను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ యువతి.. ఆమె తల్లిదండ్రులు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అవమానభారానికి గురైన సునీల్.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు.
తన ఆత్మహత్యకు యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులే కారణమని.. ఇంట్లోని వారికి వాట్సప్ మెసేజ పంపారు. తాజా పరిణామాలతో యువతి.. ఆమె తల్లితో పాటు సోదరులు ఇద్దరిపై ఎస్సీ.. ఎస్టీ వేధింపులనిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.