పొలిటికల్ బాంబ్ పేల్చిన కుమారస్వామి
కర్ణాటక కాంగ్రెస్ నుంచి 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నట్లుగా కనిపిస్తున్న కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఆ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రావటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కీలక భూమికపోషించిన శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రిపదవి రాగా.. ఎక్కువ మంది ఎమ్మెల్యేల ఆమోదం ఉన్న సిద్దరామయ్యను ముఖ్యమంత్రిని చేయటం తెలిసిందే.
కర్ణాటక విజయంతో వచ్చిన కొత్త బలం తెలంగాణ అసెంబ్లీలో టానిక్ మాదిరి కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. వారం క్రితం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించటం.. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావటం తెలిసిందే. దక్షిణాదిన రెండు బలమైన రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిన వేళలో.. బాంబు లాంటి మాటను పేల్చారు కుమారస్వామి.
కర్ణాటక కాంగ్రెస్ నుంచి 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలాన్ని రేపుతున్నాయి. ఒక మంత్రిపై ఇటీవల కేంద్ర విచారణ సంస్థలు పలు కేసులు నమోదు చేశాయని.. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురు ఆందోళన చెందుతున్నట్లుగా పేర్కొన్నారు.
కేసుల్లో చిక్కుకున్న మంత్రితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారి కలకలం రేగినట్లైంది. కుమారస్వామి వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ నాయకత్వం.. ఇందుకున్న మూలాలపై మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.