ఓటు కోసం పాదాభివందనం... కుప్పంలో ఆసక్తికర పరిణామం!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి క్లైమాక్స్ కి చేరుకుంటుంది. ఈ సమయంలో ప్రచార కార్యక్రమాలు పీక్స్ చేరుకుంటున్నాయి
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి క్లైమాక్స్ కి చేరుకుంటుంది. ఈ సమయంలో ప్రచార కార్యక్రమాలు పీక్స్ చేరుకుంటున్నాయి. మరోపక్క పోలింగ్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ శరవేగంగా పూర్తి చేస్తుందని.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేయడం తెలిసిందే! ఈ సమయంలో ఓట్ల అభ్యర్థనలో ఆసక్తికర వ్యవహారం తెరపైకి వచ్చింది.
అవును... సాధారణంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల చేతిలో మేనిఫెస్టో పెట్టి.. లేదా, నమూనా బ్యాలెట్ పెట్టి ఓట్లు అడగుతుంటారు. మహిళలైతే బొట్టు పెట్టి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తుంటారు. అయితే రొటీన్ కి భిన్నంగా.. ఉద్యోగుల కాళ్లకు మొక్కి మరీ ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా కుప్పంలో ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగులకు కొత్త రకం రిక్వస్ట్ ఎదురైంది.
ఈ క్రమంలో... కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులను వైసీపీ కార్యకర్తలు ఓట్లు అభ్యర్థిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగుల కాళ్లు మొక్కుతూ ఓట్లు అడుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో పేదల పరిరక్షణ కోసమే ఈ పాదాభివందనం అని అంటున్నారంట వైసీపీ కార్యకర్తలు!
కాగా... ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు బుధవారం ఆఖరు గడువు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఇతర జిల్లాలో ఓటు ఉండి, చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పటివరకూ 4,034 మందికిగానూ 2,941 మంది కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని చెబుతున్నారు!