తగ్గినట్టే తగ్గి.. కూటమి దూకుడు.. రీజనేంటి ..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి.. 9 నెలలు అయింది. తొలి నాళ్లలో వైసీపీ నాయకులపై కత్తికట్టి నట్టు కేసులు నమోదయ్యాయి.;
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి.. 9 నెలలు అయింది. తొలి నాళ్లలో వైసీపీ నాయకులపై కత్తికట్టి నట్టు కేసులు నమోదయ్యాయి. సుమారు 4 నెలల పాటు.. ఈ హవా కొనసాగింది. అంతేకాదు.. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను కూడా కట్టడి చేశారు.దీంతో వైసీపీ నాయకులు బయటకు రావాలంటేనే భయ పడిన పరిస్థితి ఉంది. ఇక, ఆ తర్వాత.. కోర్టుల నుంచి కొంత అభ్యంతరం వ్యక్తమైంది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే అరెస్టు చేస్తున్నారని.. అరెస్టు చేసిన వారిని ఎక్కడికి తరలిస్తున్నారని కూడా .. ప్రశ్నించింది.
దీంతో గత మూడు మాసాలుగా రాష్ట్రంలో అరెస్టులు, కేసుల పరంపర తగ్గిందనే చెప్పాలి. దీంతో వైసీపీ దూకుడు పెరిగింది. వైసీపీ నాయకులు కూటమి సర్కారుపై విమర్శలు చేయడం ప్రారంభించారు. అంతేకాదు.. తిరిగి మళ్లీ వైసీపీ పుంజుకుంటోందన్న సంకేతాలు కూడా వచ్చాయి. అంతే.. ఒక్కసారిగా మళ్లీ కేసులు-అరెస్టులతో కూటమి సర్కారు కొరడా ఝళిపించడం ప్రారంభించింది. పోసాని కృష్ణ మురళి తో ప్రారంభమైన ఈ వ్యవహారం.. ఇప్పుడు మాజీ మంత్రి రజనీ వరకు వచ్చింది.
ఇలా.. తగ్గినట్టే తగ్గి. కూటమి దూకుడు పెంచడంతో వైసీపీ నాయకులు మళ్లీ తెరమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. చాలా మంది కీలక నాయకులపై త్వరలోనే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారని కూటమి నాయకులు చెబుతున్నారు. అయితే.. వీరిపై ఎలాంటి కేసులు ఉన్నాయో చూడాలి. కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నాయని కూటమి నేతలు చెబుతున్న మాట.
ఇక, కూటమి నాయకులు ఈ దూకుడు పెంచడానికి కారణం ఏంటనేది కూడా.. రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయిన తర్వాత.. సహజంగానే అంతో ఇంతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీనిని మరింత పెంచకుండా ఉండాలన్న వ్యూహంతోపాటు.. ఇక, అంతా అయిపోయింది.. కూటమి తమను ఏమీ చేయలేదన్న ధీమాతో ఉన్న నాయకులకు సరైన ట్రీట్‌మెంటు ఇవ్వాలన్న ఉద్దేశం అయి ఉంటుందన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.