ఉచిత గ్యాస్‌.. కూట‌మికి మైలేజీ ఎంత‌..!

ఈ నెల 31న దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని.. సీఎం చంద్ర‌బాబు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో ఈ ఏడాది ప‌థ‌కం పూర్త‌వుతుంది.

Update: 2024-10-26 11:30 GMT

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కానికి ప్ర‌భుత్వం రంగం రెడీ చేసింది. ఈ ఏడాది జ‌రిగిన‌ ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో కీల‌క‌మైన ప‌థ‌కం దీపం. ఈ ప‌థ‌కం కింద‌.. రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కుఏటా మూడు వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌తి నాలుగు మాసాల‌కు ఒక సిలిండ‌ర్‌ను ఇచ్చేలా ప్లాన్ చేశారు. దీనికి సంబందించి ప్ర‌భుత్వం స‌ర్వం సిద్ధం చేసుకుంది. ఈ నెల 31న దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని.. సీఎం చంద్ర‌బాబు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో ఈ ఏడాది ప‌థ‌కం పూర్త‌వుతుంది.

ఆ త‌ర్వాత‌.. 2025, మార్చి 31లోపు 1 సిలిండ‌రు, రెండోది అదే ఏడాది జూలై 31 లోపు, మూడోది 2025, నవంబరు 30 లోపు అందిస్తారు. ఈ పథకం అమలు చేసేందుకు ఏడాదిని `మూడు బ్లాకులుగా విభ‌జించారు. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు, మూడో బ్లాక్ పీడియడ్ ను డిసెంబరు 1 నుండి త‌దుప‌రి ఏడాది మార్చి 31 వరకు పరిగణిస్తారు. సో.. మొత్తంగా ఏడాదికి మూడు సిలిండ‌ర్ల‌ను అందిస్తారు. దీనికి సంబంధించి బుక్ చేసుకున్న అర్హులు.. ముందుగానే సొమ్మును పూర్తిగా చెల్లించాలి. ఆ త‌ర్వాత‌.. స‌బ్సీడీ నిధుల‌ను(కేంద్రం ఇచ్చే స‌బ్సిడీ పోగా.. మిగిలిన సొమ్మును) ల‌బ్ధిదారుల బ్యాంకుల‌కు జ‌మ చేస్తారు.

ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కాన్ని ఎంత మందికి అమ‌లు చేయాల‌న్న విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతూనే ఉంది. ప్ర‌స్తానికి ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీనిలో భాగంగానే ఇప్పటికే మూడు ప్ర‌ధాన గ్యాస్‌(హెచ్‌పీ, ఇండేన్‌, భార‌త్‌) కంపెనీలతో మాట్లాడారు. గ్యాస్‌ కంపెనీలు, ప్రభుత్వం వద్ద ఉన్న డాటాను అనుసంధానిస్తూ.. ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇక‌, ఈ పథకం అమలు చేసే క్ర‌మంలో స‌బ్సిడీ మొత్తాన్ని ఆయా కంపెనీల‌కు చెల్లించేందుకు అడ్వాన్పుగా ఈ ఏడాదికి (1 సిలిండ‌ర్‌కు) రూ.894.92 కోట్లను చెక్కు రూపంలో ఆయా కంపెనీల‌కు కూడా అందించ‌నున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. అస‌లు చిక్కు మాత్రం ఇక్క‌డే ఉంది.

ఎంత మందిని ల‌బ్ధిదారులుగా పేర్కొంటున్నారు? అనేది స‌మ‌స్య‌. ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా ఇస్తామ‌ని చెప్పారు. అయితే.. ఇది సాధ్యం కాదు. ఈ నేప‌థ్యంలో ల‌బ్ధిదారుల‌ను ప్ర‌త్యేకంగా గుర్తించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. దీని ప్ర‌కారం.. రాష్ట్రంలో కోటీ 55 ల‌క్ష‌ల గ్యాస్ క‌నెక్ష‌న్లు ఉన్నాయి. అయితే.. స‌ర్కారు మాత్రం 9 ల‌క్ష‌ల 65 వేల క‌నెక్ష‌న్ల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. అంటే.. మొత్తం కనెక్ష‌న్ల‌లో 10 శాతం కూడా లేక‌పోవ‌డమే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. మ‌రి ఇంత త‌క్కువ మందినే ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధి దారులుగా తీసుకుంటే.. మ‌హిళాగ్ర‌హం క‌నిపించ‌దా? అనేది ప్ర‌శ్న‌. మ‌రి దీనిని ఎలా మేనేజ్ చేస్తారో.. చూడాలి. ఇక‌, ఈ ప‌థ‌కం ఏటా అమ‌లు చేయ‌డం ద్వారా.. ఏడాదికి స‌ర్కారుపై రూ.2,684.75 కోట్ల మేర భార ప‌డ‌నుంద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News