బాబు హయాంలో దోచేసింది లక్షల కోట్లా...?
వరస స్కాములు తప్ప నాడు బాబు ఏలుబడిలో స్కీములు అన్నవే లేవు అన్నది జగన్ ప్రధాన ఆరోపణ.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 దాకా ఏపీని పాలించారు. ఆయన అయిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. దోచుకో దాచుకో పంచుకో అన్నది టీడీపీ విధానమని ఆయన అనేక సార్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఎమ్మిగనూరు సభలో సైతం జగన్ అదే చెప్పారు.
అవినీతి బాబు హయాంలో పరాకాష్టకు చేరింది అని ఆయన అనేక కుంభకోణాలను సభకు వినిపించారు. అందులో స్కిల్ స్కాం కేసుని ముందు ఫైబర్ నెట్ అమరావతి భూముల దందా అంటూ జగన్ చాలా చెప్పుకొచ్చారు. ఆయన అన్నది ఏంటి అంటే జన్మభూమి కమిటీలు ప్రతీ గ్రామంలో ఉంటాయి అక్కడ నుంచి మొదలైన టీడీపీ అవినీతి భాగోతం అమరావతి రాజధాని దాకా పాకిపోయిందని.
వరస స్కాములు తప్ప నాడు బాబు ఏలుబడిలో స్కీములు అన్నవే లేవు అన్నది జగన్ ప్రధాన ఆరోపణ. ఇక తాను అధికారంలోకి వచ్చిన 52 నెలల కాలంలో ఏపీలో మహిళల ఖాతాలో ఏకంగా రెండు లక్షల 38 వేల కోట్ల రూపాయల నగదును నేరుగా జమ చేశామని ఆయన అంటున్నారు. మరి ఇంత డబ్బు నాడు ఏమైంది అన్నది జగన్ ప్రజలకు పంపిస్తున్న ప్రశ్న.
అదే రాష్ట్రం, అంతే ఆదాయం, అప్పులు కూడా గతంలో పోలిస్తే చాలా తక్కువ. మరి తాను ప్రతీ ఇంటికీ లక్షల రూపాయల వంతున స్కీముల ద్వారా అందచేస్తున్నాను, అదే చంద్రబాబు పాలనలో ఎందుకు చేయలేకపోయారు అని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అన్నది కీలకమైన మౌలికమైన ప్రశ్ననే జగన్ లేవనెత్తుతున్నారు.
నిజం చెప్పాలంటే 2014 నుంచి 2019 దాకా ఏటా బడ్జెట్ చూసుకుంటే లక్షన్నర కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల దాకా ఉంటూండేది. అలా అయిదేళ్లకు తీసుకుంటే కచ్చితంగా ఎనిమిది నుంచి పది లక్షల కోట్ల దాకా ఉంటుంది. మరి ఇందులో రెండున్నర లక్షల కోట్లను తాను నాలుగేళ్ళ కాలంలో ప్రజలకు ఇచ్చాను అని జగన్ అంటున్నారు. అంటే అయిదేళ్లకు లెక్క తీస్తే ఈ మొత్తం కచ్చితంగా మూడు లక్షల కోట్ల రూపాయల దాకా అవుతుంది.
అంటే అయిదు వార్షిక బడ్జెట్ లలో ఉద్యోగుల జీతభత్యాలు పాలనా వ్యవహారాలు అభివృద్ధి, ఇత్యాదివి ఒక పక్కన పెడితే మూడవ వంతు మొత్తాన్ని తాను ఏకంగా పేదల కోసమే ఖర్చు చేశాను అని జగన్ లెక్క తీసి అన్నీ చూసి మరీ చెబుతున్నారు అన్న మాట.
అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతీ రూపాయలో ముప్పయి మూడు పైసలు తిరిగి ప్రజల ఖాతాలలోకే తాను వేస్తున్నాను అని ఆయన అంటున్నారు. మరి నాడు ఈ మొత్తం ఏమైంది అన్నది జగన్ అడుగుతున్న ప్రశ్న. ప్రజలకు కూడా దీని మీదనే ఆయన ఆలోచించమని కోరుతున్నారు. అంటే నాడు ఇన్ని స్కీములు లేవు, జన్మ భూమి కమిటీలు పెట్టి మరీ మధ్యవర్తులు ఇచ్చే ఆ పెన్షన్ ని కూడా దోచేసారు అలాగే ఇతరత్రా అవినీతితో లక్షల కోట్లు స్వాహా అయ్యాయని జగన్ విడమరచి చెబుతున్నారు.
నిజంగా అయిదేళ్ల పాలనలో ఇన్ని లక్షల కోట్లు అవినీతి జరిగింది అంటే కచ్చితంగా ఇది అతి భయంకరమైన స్కాం కిందనే భావించాలి. మరి జగన్ ప్రతీ సభలో ఇదే చెబుతూ అయిదేళ్ళూ ప్రజలకు ఏ స్కీం ఇవ్వకుండా బాబు హయాంలో దోచుకున్నారు అని అంటున్నారు. అదే విధంగా ప్రజలకు ఏ విధంగానూ గత ప్రభుత్వం దోహదపడలేదని ఆయన అంటున్నారు.
మొత్తంగా చూస్తే ఈ స్కాం ఆ స్కాం అని కాకుండా అనేక రకాలైన స్కాముల ద్వారా లక్షల కోట్లు గల్లంతు అయ్యాయని జగన్ చెబుతున్నారు. ఒక వైపు అవినీతి ఆరోపణల మీద స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో చంద్రబాబు గత నలభై రోజులుగా జైలు గోడల మధ్యన ఉన్నారు. దాంతో పాటు ముఖ్యమంత్రి జగన్ గత ప్రభుత్వంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని గణాంకాలతో చెబుతున్నారు.
మీరే ఆలోచించుకుని చంద్రబాబు పాలన తన పాలన గురించి తీర్పు చెప్పాలని ఆయన కోరుతున్నారు. నిజం చెప్పాలీ అంటే ఏ ప్రభుత్వం అయినా చేసే ఖర్చుకు కచ్చితంగా వివరాలు ఆధారాలు ఉండాలి. ఇక జగన్ ప్రభుత్వం తీసుకుంటే ఎక్కడ ఖర్చు చేసింది అన్న దానికి అభివృద్ధి వరకూ లేక ఇతర ఖర్చులు చూసుకుంటే పక్కాగా వివరాలు ఎటూ ఉంటాయి. ఉద్యోగుల జీత భత్యాలు అన్నవి కూడా పెద్ద మొత్తం కాబట్టి అలాగే కనిపిస్తాయి.
కానీ స్కీముల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ వివరాలు ఎపుడూ పక్కాగా ఉండవు. కానీ నగదు బదిలీ పధకం ద్వారా జగన్ నేరుగా లబ్దిదారుల ఖాతాలో మొత్తాలు వేయడం వల్ల ఇపుడు ఆ వివరాలు అన్నీ వైట్ పేపర్ గా బయటకు కనిపిస్తున్నాయి. దాంతోనే ఆయన మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం గత ప్రభుత్వం ఇవ్వలేదని చెబుతున్నారు. నాడు జరిగింది కచ్చితంగా లక్షల కోట్ల దోపిడీ అని ఆరోపిస్తున్నారు. మరి జనాలు వీటిని గమనించి ఆలోచిస్తారా అన్నది చూడాల్సి ఉంది.