టీటీడీ చైర్మన్ పదవి వద్దంటున్నారా ?

ఏపీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి.

Update: 2024-10-13 14:30 GMT

ఏపీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి. పుణ్యానికి పుణ్యం. గౌరవానికి గౌరవం. ఇహం పరం అని చెప్పాల్సి వస్తే ఆ పదవి గురించే మాట్లాడుకోవాలి. అటువంటి పదవి విషయంలో ఆ మధ్య దాకా ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు.

టీటీడీ చైర్మన్ గిరీ తమకు ఇస్తే ఆ దేవదేవుడి సేవలో తరిస్తామని కూడా కూటమి పెద్దలకు విన్నపాలు పంపారు. టీటీడీ చైర్మన్ పదవికి తెలుగుదేశం, బీజేపీ జనసేనల నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ మీటింగులో మాట్లాడుతూ తన సోదరుడికి ఆ పదవి అక్కరలేదని చెబుతూనే ఆ పదవి కోసం తనకు కూడా ఎంతో మంది అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.

ఇక కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వారా కొంతమంది సిఫార్సు చేయించుకుని తమ పేర్లను పరిశీలించమని కూడా కోరారు అని కూడా వినిపించింది. ఇవన్నీ ఇలా ఉంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో గత నెల 18న ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తరువాత చెలరేగిన ఆధ్యాత్మిక రాజకీయ దుమారం అంతా చూసిన వారు మాత్రం టీటీడీ చైర్మన్ పదవి వద్దు అనే అనుకుంటున్నారుట.

ఈ రోజున ప్రపంచం మొత్తం కళ్ళు టీటీడీ మీదనే ఉన్నాయని అంటున్నారు. శ్రీవారి భక్తులు అంతా కోట్ల కళ్ళతో ఆ వైపే చూస్తారని అందువల్ల స్వామి సేవలలో తరించాలని ఉన్నా అది కత్తి మీద సాము లాంటి వ్యవహారం అవుతుందని కూడా భావిస్తున్నారుట.

ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయడం కూటమి పెద్దలకు ఒక సవాల్ గా మారుతోంది అని అంటున్నారు. గతంలో అయితే పెద్ద సంఖ్యలో ఆశావహులు ఈ పదవిని కోరుకోవడంలో ఎలా సర్దిచెప్పడం అన్న చర్చ సాగింది. ఇపుడు ఎవరిని ఎంపిక చేయాలన్నది మరో సమస్యగా మారింది అని అంటున్నారు.

రాజకీయ నేతలకు ఈ పదవిని అప్పచెబితే భక్తకోటి నుంచి విమర్శలు రావడం సహజం అని అంటున్నారు అలా కాకుండా విభిన్న రంగాలలో తమకంటూ పేరు తెచ్చుకున్న వారిలో ఒకరిని ఎంపిక చేయాలని చూసినా అది కూడా వీలు పడడంలేదుట.

ఒక అత్యున్నతమైన రంగంలో తన పదవిని పూర్తి చేసి ప్రస్తుతం విశ్రాంతిని తెసుకుంటున్న ఒకరిని ఈ పదవి విషయం గురించి సంప్రదిస్తే తాను శ్రీవారి భక్తుడనే కానీ ప్రస్తుతం ఆ పదవిని చేపట్టలేనని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అలాగే ఒకకేంద్ర మాజీ మంత్రికి ఈ పదవిని అప్పగించాలని చూసినా ఆయన కూడా తనకు ఉన్న బాధ్యతలు వయోభారం దృష్ట్యా వద్దు అని చెప్పారని అంటున్నారు.

ఇక ఒక టీవీ మీడియా అధిపతి పేరు గతంలో బాగా నానింది. ఇపుడు ఆయన పేరు పరిశీలనకు కూడా రావడం లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీటీడీ బోర్డు లేకుండానే ఈసారి బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఇపుడు చైర్మన్ పదవితో పాటు పాలక వర్గాన్ని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది కానీ ఎవరిని చైర్మన్ చేయాలి అన్నదే తేలడం లేదు అని అంటున్నారు.

అందరి మన్ననలు పొందిన వారు గతంలో ఏ మచ్చ లేని వారు శ్రీవారి పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండి ఆగమ శాస్త్రం మీద పూర్తి అవగాహన ఉన్న వారికి ఈ పదవి ఇస్తే బాగుంటుంది అన్నదైతే ఉంది. మరి అలాంటి వారి కోసమే కూటమి పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News