ఎన్నికల సమరంలో అందరూ అప్పుల అప్పారావులే !
ఏ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం ప్రపంచ చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం అన్నది మహా కవి శ్రీశ్రీ చెప్పిన మాట.
ఏ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం ప్రపంచ చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం అన్నది మహా కవి శ్రీశ్రీ చెప్పిన మాట. అలాగే ఇపుడు చూస్తే కనుక అప్పు చేయని వాడు తప్పు చేసినట్లే అన్నట్లుగా ఉంది. అప్పు ఎవరికి లేదు ఆ తిరుపతి వెంకటేశుడికి కూడా అప్పు ఉంది కదా అని చెప్పవచ్చు. ఇక మనలను పాలించాలని చూస్తున్న రాజకీయ నాయకులను చూస్తే వారికి ఎంత ఆస్తి ఉందో ఆ పక్కనే అప్పులు కూడా ఉంటున్నాయి.
వర్ధమాన రాజకీయ నేతల నుంచి ప్రవర్ధమాన నేతల వరకూ ఇదే పరిస్థితి. అందరూ రుణ గ్రహీతలే. అందరూ అప్పులతో సతమతం అవుతున్న వారే అని నామినేషన్ల దాఖలు సందర్భంగా రుజువు అయిన పరమ సత్యం. పవన్ కళ్యాణ్ కేంటి ఆయన పవర్ స్టార్. రోజుకు రెండు కోట్లు పారితోషికం తీసుకుంటారు అని అంతా అనుకుంటారు. అది కూడా ఆయనే చెప్పారు. కానీ అప్పులు ఆయనకూ ఉన్నాయి. అవి కూడా డెబ్బై కోట్ల రూపాయలు దాటి ఉన్నాయి. ఆయన తన వదిన గారి దగ్గర రెండు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోవడం నుంచి ఎంతో మంది దగ్గర అప్పులు తీసుకున్నారని అఫిడవిట్ లో ఉంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అఫిడవిట్ తీసుకున్నా ఆస్తుల పక్కనే అప్పులు కనిపిస్తున్నాయి. ఆయన ఆస్తులు చూస్తే 800 కోట్లకు పైనే ఉన్నాయి. కానీ చంద్రబాబుకు కేవలం 1.20 కోట్ల ఆస్తులే ఉన్నాయి. ఇక భార్య భువనేశ్వరి వద్దనే చంద్రబాబు ఏకంగాకోటిన్నర రూపాయలు తీసుకున్నట్లుగా అఫిడవిట్ లో చూపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో చూస్తే ఆయనకు ఆస్తులు కోట్లలో ఉన్నా కూడా చిన్న కారు కూడా లేదు అని అఫిడవిట్ చెబుతోంది. ఇక వైఎస్ షర్మిల స్వతహాగా కోటీశ్వరురాలు కానీ ఆమెకూ అప్పులు ఉన్నాయి. అవి కూడా అన్నా వదినల నుంచే ఉండడం విశేషం.
టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ తీసుకుంటే ఆయన ఆస్తి 520 కోట్లుగా చూపించారు. కానీ ఆయనకు ఏపీలో సొంత ఇల్లు లేదు కనీసం కారు కూడా లేదు. ఆయన ఎపుడో పదిహేడేళ్ళ క్రితం కొన్న కారునే ఇప్పటికీ వాడుతున్నారు అని అఫిడవిట్ లో ఉంది.
వీరే కాదు ఎంపీలుగా పోటీ చేస్తున్న బిగ్ షాట్స్ అంతా అప్పులు ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఆస్తులు ఉంటే అందులో తన వాటా చాలా తక్కువ భార్యల వాటాయే ఎక్కువ అని చూపిస్తున్నారు. తమకు కనీసం తిరిగేందుకు వాహనం లేక అద్దె వాహనాన్నే తీసుకుంటున్నట్లుగా చూపిస్తున్నారు.
అలాగే ఎమ్మెల్యే అభ్యర్ధులను తీసుకుంటే వారు కూడా అప్పుల కుప్పల కధను వినిపిస్తున్నారు ఫలానా చోట నుంచి సంపాదన ఉందని చెబుతూనే దానితో పాటుగా అప్పుగా కొండంత ఉందని మరో వైపు చూపిస్తున్నారు.ఈ అఫిడవిట్లు అన్నీ చూసిన మీదట సగటు జనాలు హాయిగా గుండె మీద చేయి వేసి పడుకోవచ్చు. బడా రాజకీయ నేతలకే కోట్లలో అప్పులు ఉన్నాయి. వారితో పోలిస్తే మనమెంత అని పూర్తిగా తృప్తి పడవచ్చేమో.