హాలిడే మూడ్ లోకి లీడర్లు

తెలంగాణ లోక్ సభ, ఆంధ్రప్రదేశ్‌ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.

Update: 2024-05-14 06:29 GMT

తెలంగాణ లోక్ సభ, ఆంధ్రప్రదేశ్‌ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభలో ఎన్నికల ప్రజా తీర్పు భద్రంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్‌ పోల్స్‌ తెలియాలన్నా.. జూన్‌ 1వ తేదీ వరకు ఆగాల్సిందే. మరోవైపు ఇన్నాళ్లూ ప్రచార హడావుడి, మైకుల హోరు, రోడ్‌షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు.. ఇలా ప్రతిక్షణం హడావుడిగా గడిపిన అభ్యర్థులు, నాయకులు ఇప్పు డు సేదతీరేందుకు సిద్ధమవుతున్నారు.

పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట్లైంది. ఇక ఓట్ల లెక్కింపు కోసం నేతలు 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. మిగతా మూడు దశలు కూడా పూర్తైన తర్వాత దేశవ్యాప్తంగా జూన్‌ 4 న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టేబుల్స్‌ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈవీఎంలతో పాటు 500 పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లకు ఒక టేబుల్‌ను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పోలైన పోస్టల్‌ బ్యాలట్‌లను ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్‌రూంల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతోపాటు సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News