అమెరికాలో తగ్గుతోన్న ప్రజల ఆయుర్దాయం... కారణాలివే?
అగ్రరాజ్యం అమెరికాలో ప్రజల ఆయుర్దాయం తగ్గుతుందా.. గత వందేళ్లలో ఎన్నడూ లేనట్లుగా ప్రజల ఆయుష్షు బాగా తగ్గిపోతోందా.. అంటే అవుననే అంటున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ప్రజల ఆయుర్దాయం తగ్గుతుందా.. గత వందేళ్లలో ఎన్నడూ లేనట్లుగా ప్రజల ఆయుష్షు బాగా తగ్గిపోతోందా.. అంటే అవుననే అంటున్నారు. ఇందులో భాగంగా... 1900 ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన అమెరికా ప్రజల ఆయుర్దాయం తగ్గిపోతోందని తెలుస్తుంది. దీనికి గల కారణాలు తాజాగా తెరపైకి వస్తున్నాయి.
అవును... అమెరికాలో ప్రజల ఆయుర్దాయం గతంలో ఎన్నడూ లేనివిధంగా తగ్గిపోతోందని అంటున్నారు. దీనికి కరోనా వైరస్ మహమ్మారి కొంత కారణం అయినప్పటికీ... ఇంకా అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా... ఆదాయ అసమానాతలు, డ్రగ్స్, పెరుగుతున్న గన్ కల్చర్, క్యాన్సర్స్, గుండె జబ్బులు మొదలైనటువంటివి కారణాలని అంటునారు.
ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా మహమ్మారి అనేది అన్ని రకాలుగానూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా వంటి దేశంలో ఇది రాజకీయంగా మరింత హాట్ టాపిక్ అయ్యింది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక మూడేళ్లలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ మంది మరణించారు. ఆ సంఖ్య ఇప్పటివరకూ 10లక్షలు దాటిందని అంటున్నారు.
కరోనా వైరస్ ఇప్పుడు తన రూపం మార్చుకుని రకరకాలుగా మనిషి మనుగడపై ప్రభావం చూప్స్తుందని అంటున్నారు. కరోనా వస్తే కనిపించే జ్వరం, జలుబు వంటి రెగ్యులర్ సింటంస్ కనిపించకుండానే... శరీరంలోని మెదడు, కిడ్నీలపై తన ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. దీంతో... గత కొన్నేళ్లలో అమెరికాలో అత్యధిక మరణాలు సంభవించడానికి ఇది అతిపెద్ద కారణాల్లో ఒకటిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
కరోనాతోపాటు పెరుగుతున్న ఆర్థిక అసమానతలు కూడా ప్రజల ఆయుర్దాయం తగ్గిపోవడానికి గల కారణాల్లో ఒకటి అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ఆదాయం, ఇల్లు, విద్య వంటి అంశాలు కూడా ఆయుర్దాయంపై ప్రభావం చూపుతుంటాయని అంటున్నారు.
ఇదే క్రమంలో... అందుబాటులో ఉన్న వైద్య సేవల్లో మార్పుల వల్ల కూడా అమెరికాలో ప్రజల ఆయుర్దాయంలో తేడాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి 60 ఏళ్ల క్రితమే మెడికైడ్ ప్రోగ్రాం ప్రారంభమైనప్పటికీ... అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఈ స్కీం ప్రయోజనాలు మరింత మందికి అందించేలా దీన్ని విస్తరించారు.
అయితే అంతిమంగా ఈ స్కీం అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం రాష్ట్రాలకే ఉంటుంది. దీంతో ఈ స్కీం లో తీసుకొచ్చిన మార్పులతో సుమారు 10 రాష్ట్రాలు దీన్ని నిరాకరించాయి. దీంతో పేద ప్రజల సగటు ఆయుర్దాయం తక్కువగా ఉన్నట్లు పలు పరిశోధన గణాంకాలు చెబుతున్నాయి.
ఇలా కరోనా వైరస్, ఆర్ధిక అసమానతల ఫలితంగా అందని వైద్య సేవల వల్లతో పాటు ప్రజల ఆయుర్దాయం తగ్గిపోయేందుకు నేరాలు, వాటి శిక్షలు కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో... ప్రజల ఆయుర్దాయం తగ్గడానికి యుద్ధం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. గత ఇరాక్, అఫ్గానిస్తాన్ లలో 20 ఏళ్లలో అమెరికా సుదీర్ఘకాలంగా యుద్ధాలు చేసింది. ఈ పోరాటంలో 58 వేల మంది అమెరికన్లు చనిపోయారు.
ఇదే సమయంలో అమెరికాలో విచక్షణ రహిత కాల్పుల ఘటనల్లో చాలా మంది చనిపోతున్నారు. గత కొన్నేళ్లలో కాల్పుల ఘటనలలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగింది. అమెరికాలో వీకెండ్ అయితే ఏదో ఒక మూల కాల్పుల శబ్ధం వినిపించడం రొటీన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇది కూడా ప్రజల ఆయుర్దాయం తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
ఇదే క్రమంలో అమెరికా ప్రజల ఆయుర్దాయం తగ్గడానికి డ్రగ్స్ మితిమీరి తీసుకోవడం కూడా ఒక బలమైన కారణం అని అంటున్నారు. డ్రగ్స్ అత్యధిక మోతాదులో తీసుకోవడం వల్ల అగ్రరాజ్యంలో గత సంవత్సరం సుమారు లక్షా 80 వేల మందికి పైగా మరణించినట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. 2020 సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 50 శాతానికి పైగా అధికం అని అంటున్నారు.
ఇక ప్రజల ఆయుర్దాయంలో క్యాన్సర్, గుండె వ్యాధుల వల్ల సంభవించే మరణాలు కూడా బాగా పెరిగాయని అంటున్నారు. డ్రగ్ అత్యధిక మోతాదులో తీసుకోవడం.. ఆత్మహత్యలు, ఆల్కాహాల్ వల్ల కంటే ఎక్కువగా క్యాన్సర్, గుండె వ్యాధుల వల్ల మరణిస్తున్నారు అని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల వల్ల అమెరికాలో ప్రతి సంవత్సరం ఆరు లక్షల మంది కంటే ఎక్కువగా చనిపోతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. అదేవిధంగా... ఆయుర్దాయం తగ్గేందుకు ఊబకాయంతో సంబంధమున్నట్లు చెబుతుంటారు.