నిరుపేద యువకుడు.. యూట్యూబ్ వీడియోలతో రూ.400 కోట్లు!
యూట్యూబ్ వీడియోల ద్వారా భారీ ఆదాయం వస్తుండటంతో చిన్నతనంలో తమకు ఏమేమి లేవని అతడు ఫీలయ్యాడో అవన్నీ సంపాదించుకున్నాడు. దిల్లీ, దుబాయ్ నగరాల్లో వందల కోట్ల విలువ చేసే ఇళ్లు కట్టుకున్నాడు.
ఉన్నత చదువులు చదవకపోయినా, ఉన్నత ఉద్యోగం చేయకపోయినా ఏం ఫర్లేదు. తెలివితేటలు ఉంటే చాలు.. ఏదైనా అంశాన్ని ప్రభావంతంగా చెప్పగలిగితే చాలు.. ఇలాంటి వారందరికీ యూట్యూబ్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇలాగే రాజస్థాన్ కు చెందిన ఒక పేద యువకుడు యూట్యూబ్ వీడియోల ద్వారా రూ.400 కోట్ల ఆదాయాన్ని సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు. ప్రతినెలా కోటి రూపాయల ఆదాయం కళ్లజూస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని అజ్మీర్ కు గౌరవ్ చౌధురిది ఒకప్పుడు పేద కుటుంబం. చిన్న రేకుల షెడ్డులో నివాసం. బతుకుదెరువు కోసం అతడి తండ్రి నిర్వహించే చిన్నపాటి బడ్డీకొట్టే వారి జీవనాధారం. గౌరవ్ బంధువులంతా స్థితిమంతులే. దీంతో ఖరీదైన బట్టలతో కార్లలో తిరిగేవారు. దీంతో తాము కూడా ఆర్థికంగా స్థితిమంతులు కావాలని గౌరవ్ చౌధురి భావించాడు.
ఈ క్రమంలో కిరాణాషాపు మీద వచ్చేది సరిపోక గౌరవ్ తండ్రి సంపాదన కోసం దుబాయ్ వెళ్లాడు. దీంతో తల్లితో కలిసి తమ బడ్డీ కొట్టు నడుపుతూనే గౌరవ్ స్కూలుకెళ్లాడు. ఇదే క్రమంలో ఇంటర్ లో స్నేహితుల ద్వారా టెక్నాలజీపైన అతనికి ఆసక్తి ఏర్పడింది. దీంతో కాలేజీ మానేసి కోడింగ్ నేర్చుకోవడంపైన దృష్టి సారించాడు. దీంతో కాలేజీ ఎగ్గొట్టి ఏదేదో నేర్చుకుంటున్నావంటూ అతని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు.
గౌరవ్ ఆసక్తిని లెక్చరర్లు గుర్తించి అతడిని ఎలక్ట్రానిక్స్ చదువుకోమని ప్రోత్సహించారు. అయితే గౌరవ్ తండ్రి మాత్రం ఇంటర్ అయ్యాక ఏదో ఒక ఉద్యోగంలో పెట్టొచ్చని కొడుకును తన వెంట దుబాయ్ తీసుకెళ్లిపోయాడు. అక్కడ పని చేయడానికి ఇష్టపడని గౌరవ్ చదువు మీద దృష్టి సారించి పెట్టి బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో సీటు సంపాదించాడు. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ లో చేరిపోయాడు.
ఇక 2012లో చదువు పూర్తి చేసిన తరవాత గౌరవ్ కొంత కాలం దుబాయ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ లో సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ సర్వీస్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో తనకొచ్చే వివిధ సందేహాల నివృత్తికి యూట్యూబ్ లో వీడియోలు చూసేవాడు. ఈ నేపథ్యంలోనే తాను కూడా ఒక యూట్యూబ్ చానల్ ను పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
2015లో ఉద్యోగం మానేసి 'టెక్నికల్ గురూజీ' పేరిట యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేశాడు. కొత్తగా మార్కెట్ లోకి వచ్చే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, కార్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. చాలా కష్టమైన సాంకేతిక విషయాలను కూడా చాలా సులువుగా, అందరికీ అర్థమయ్యేలా హిందీలో వివరించేవాడు. దీంతో వీక్షకుల సంఖ్య పెరిగింది. అలాగే సైబర్ మోసాలు, డిజిటల్ స్కాముల గురించి కూడా వివరించడం మొదలుపెట్టాడు. దీంతో అతడి యూట్యూబ్ చానల్ కు భారీ ఎత్తున సబ్ స్కైబర్లు చేరారు. దీంతోపాటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం 'టెక్నికల్ గురూజీ' యూట్యూబ్ చానల్ కు రెండున్నర కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీంతో దేశంలోనే అత్యధికమంది చందాదారులున్న టెక్ యూట్యూబ్ చానల్ గా నిలిచింది. గౌరవ్ యూట్యూబ్ లో రోజూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాడు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల గురించి ప్రతి ఆదివారం వివరిస్తుంటాడు.
యూట్యూబ్ వీడియోల ద్వారా భారీ ఆదాయం వస్తుండటంతో చిన్నతనంలో తమకు ఏమేమి లేవని అతడు ఫీలయ్యాడో అవన్నీ సంపాదించుకున్నాడు. దిల్లీ, దుబాయ్ నగరాల్లో వందల కోట్ల విలువ చేసే ఇళ్లు కట్టుకున్నాడు. అత్యంత ఖరీదైన పోర్షే, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, థార్.. ఇలా అనేక కార్లు అతడికి ఉన్నాయి.
తాను, తన కుటుంబ సభ్యులు వాడే ఫోన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని రష్యాలో బంగారు ఐఫోన్లను కస్టమైజ్డ్‌గా తయారు చేయించుకున్నాడు. వన్ ప్లస్, శాంసంగ్, గూగుల్ వంటి ప్రఖ్యాత సంస్థలు సైతం గౌరవ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ టెక్నాలజీ వివరాలను అతనితో పంచుకున్నాయి. ఆ సంస్థలు తమ ఆఫీసుల్లో వీడియో చేసుకోవడానికి గౌరవ్ కు అనుమతిని కూడా ఇచ్చాయి.
ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలవాలని ఎవరికి ఉండదో చెప్పండి! గౌరవ్ వీడియోలను చూసిన టిమ్ కుక్ స్వయంగా అతడిని కలవాలనుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ముంబయిలో ప్రారంభమైన ఆపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆయనే నేరుగా గౌరవ్ ను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలానే కొన్ని దినపత్రికలు అతడితో టెక్ కాలమ్‌లూ, టీవీ ఛానళ్లు షోలూ చేయిస్తుండటం విశేషం. కొన్ని వెబ్ సైట్లు సైతం అతని వీడియోలను కొని పోస్ట్ చేసుకుంటున్నాయి.