టార్గెట్ కేజ్రీ.. వయా కవిత.. బై అప్రూవర్స్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడంతో ఢిల్లీ లిక్కర్ కేసు పెద్ద మలుపులు తిరిగింది.
దాదాపు రెండేళ్లుగా సాగుతోంది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. అసలు స్కాం జరిగింది ఢిల్లీలో అయితే దీని మూలాలు తెలంగాణ, ఆంధప్రదేశ్ వరకు వ్యాపించాయి. మరోవైపు ఢిల్లీలో మనీశ్ సిసోడియాను అరెస్టు చేశారు. అయితే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంగతి ఏమిటి..? లిక్కర్ స్కాంలో ఆయననే వెలెత్తి చూపుతోంది బీజేపీ. కానీ, ఏడుసార్లు సమన్లు ఇచ్చినా విచారణకు రాలేదు. ఇంకా ఏంచేయాలి?
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడంతో ఢిల్లీ లిక్కర్ కేసు పెద్ద మలుపులు తిరిగింది. ఈ కేసులో ఆమె ఏం చేస్తారు అనేది చూడాలి. కాగా.. ఈ కేసులో ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ లో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో కవిత మాత్రమే మిగలడం గమనార్హం. ఈమె మాత్రమే నిందితురాలు అన్నమాట.
కవిత బినామీ అరుణ్ నుంచి..
స్కాంలో తొలినాళ్లలో బాగా వినిపించిన పేరు అరుణ్ రామచంద్ర పిళ్లై. ఆయన కవిత బినామీ అని ఈడీ ఆరోపించింది. వ్యాపారం అంతా ఈయన చేతుల మీదుగానే సాగిందనేది ఈడీతో పాటు సీబీఐ వాదన. అయితే, పిళ్లై దీనిని అంగీకరించినట్లే చేసి.. అనంతరం వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్పారు. మళ్లీ మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు. ఇక ఒంగోలు ఎంపీ
మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు. వీరంతా సౌత్ గ్రూప్ లో కీలకం. కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఈయన దగ్గర స్టేట్ మెంట్లు మళ్లీ తీసుకున్నారు. అప్రూవర్లుగా మారడం అంటే.. స్కాం చేశామని అంగీరించి.. నిజాలు చెప్పడమే. దీంతో నిందితులుగా ఉన్నవారు చిక్కుకుంటారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత మాత్రమే అప్రూవర్ కాలేదు. దీంతో ఆమెనే టార్గెట్ చేశారా? అన్న అనుమానం కలుగుతోంది. కానీ, కథ వేరే ఉంది.
కథ వేరే ఉంది..?
బీజేపీ టార్గెట్ కేజ్రీవాల్. ఆయన ఇంతవరకు విచారణకు వెళ్లలేదు. ఇప్పుడు కవితను కూడా అరెస్టు చేయడం ద్వారా కేజ్రీని లోపల వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అని తెలుస్తోంది. గతంలోనే విచారణ సమయంలోనే ఈడీ కవితను అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం జరిగింది. అప్పటికీ కేజ్రీ చుట్టూ ఇంత వల విసరలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముంగిట మాత్రం ఆయనను ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.